ఈ సమయంలో ఐవైఆర్ చేయాల్సింది ఇదేనా.!

434

ఏపీ విష‌యంలో రాజ‌కీయంగా అస్థిర‌త సృష్టించ‌డం ద్వారా ల‌బ్ధి కోసంభాజపా పాకులాడుతోంద‌నే విషయం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. అయితే, ఇది చాల‌ద‌న్న‌ట్టుగా, ఇదే అద‌ను అనుకుని ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే ప‌నిని ఐవైఆర్ కృష్ణారావు మొద‌లుపెట్టారు. రాజ‌ధానిపై విద్వేషాల‌ను చిమ్ముతూ ఓ పుస్త‌కం రాసారు. దాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆవిష్క‌రించారు.

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ఒక వ‌ర్గానికి ల‌బ్ధి చేకూర్చే విధంగా ప్ర‌క‌టించారంటూ తాజాగా ఐవైఆర్ వ్యాఖ్యానించారు. ఏ ప్రాతిప‌దిక‌న ఆయ‌న ఇలా విమ‌ర్శించార‌నే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే శ్రావ‌ణ్ కుమార్ అసెంబ్లీ ద‌గ్గ‌ర మాట్లాడుతూ రాజ‌ధాని ప్రాంతంపై ఆయ‌న‌కి అవ‌గాహ‌న లేద‌ని విమ‌ర్శించారు. 1978 నుంచి తాడికొండ నియోజ‌క వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వుడ్ గా ఉంద‌ని చెప్పారు. రాజ‌ధాని నియోజ‌క వ‌ర్గం ప‌రిధిలో 75 వేల మంది ఎస్సీ ఓట‌ర్లు, ముస్లింలు 50 వేల‌మంది, బీసీ ఓట‌ర్ల సంఖ్య 40 వేలు, ఓసీలు 35 వేలు’ అని వెల్ల‌డించారు. అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన‌వారంతా స‌న్న చిన్నకారు రైతులేన‌ని చెప్పారు. 26 వేల‌మంది భూములిస్తే అందులో 800 మంది మాత్ర‌మే ఐదెక‌రాల‌కు మించి పొలం ఇచ్చార‌ని చెప్పారు.

ఒక వ‌ర్గానికి ప్ర‌యోజ‌నం చేకూర్చే విధంగా రాజ‌ధాని ప్ర‌క‌టించార‌ని ఐవైఆర్ ఆరోపించారు. కానీ ఓసీల జ‌నాభా కేవ‌లం ముప్ఫై ఐదువేలు మాత్ర‌మే ఉంది. క‌, రాజ‌ధాని భూముల విష‌యానికొస్తే,  ఈ భూములు రాజ‌ధాని నిర్మాణానికి అనుకూల‌మైన‌వి కాద‌ని ఐవైఆర్ ప్ర‌భుత్వంలో ఉండ‌గా ఎందుకు చెప్ప‌లేదు. ఈ ప్రాంతం రాజ‌ధాని అనుకూలం కాద‌ని తెలిస్తే నాడే చెప్పాలి క‌దా మ‌రి. అమ‌రావ‌తి మీద దుష్ప్ర‌చారం చేస్తున్న ఐవైఆర్ వెన‌క కొన్ని అదృశ్య శ‌క్తులు ఉన్నాయ‌నీ తెదేపా నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రం స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు ఐవైఆర్ లాంటి అనుభ‌వ‌జ్ఞులు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించే ప‌నులు చేయాలి కదా. రాష్ట్రాన్ని స‌మ‌స్య‌లు చుట్టుముట్టిన ఈ స‌మ‌యంలో విమ‌ర్శ‌ల‌కు దిగ‌డ‌మూ, ప్ర‌భుత్వాన్ని మ‌రింత ఇబ్బందిపెట్టే విధంగా రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఎగ‌దోసేలా ప్ర‌య‌త్నించ‌డం స‌రైన‌దేనా..