తాత్కాలిక జిల్లా కమిటీల దిశగా అడుగులు వేస్తున్నారు

111

ఇప్పటివరకూ పోరాటయాత్రలు, కవాతులతో కాలం గడిపిన జనసేన అధినేత జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరుసగా రెండు రోజుల పాటు శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో సమావేశం నిర్వహించారు.

సంస్థాగత నిర్మాణ దిశగా పార్టీకి ఏదైనా కొంత చేయాలని అనుకుంటున్నారు. జిల్లాల వారీగా తాత్కాలిక కార్యవర్గాలను అయినా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన అభిమానులతో పవన్ సమావేశమయ్యారు. పార్టీ విధివిధానాల గురించి చెప్పారు. జిల్లాలో అన్ని కులాల వారు జనసేనను అభిమానిస్తున్నారని, కులాల మధ్య సయోధ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని, నేతల్లో సమన్వయం పెరగాలని సూచించారు.

ఈ సమీక్షల్లో నాదెండ్ల మనోహర్, మరో ఇద్దరు సీనియర్ నేతలు జిల్లాల నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. నెల్లూరు నేతలతో జరిగిన సమావేశంలో వారసత్వ రాజకీయాలపై పవన్ ఫైరయ్యారు. నెల్లూరు జిల్లాలో కేవలం పది కుటుంబాలే రాజకీయం చేస్తున్నాయని, ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందేనన్నారు. రాజకీయ వారసత్వంతో మనుగడ సాగిస్తున్న కుటుంబాలను రాజకీయంగా ఎదుర్కొవడానికి యువత శక్తి యుక్తులతో, ఓపికతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఈ నెల 9న స్వల్ప కాలానికి పని చేసే జనసేన జిల్లా కమిటీని ప్రకటిస్తామని  చెప్పారు.

పండగ నాటికి అన్ని జిల్లాల సమావేశాలను పూర్తి చేసి, పండుగ తరువాత నుంచి జిల్లాలకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే ఐదు జిల్లాల పర్యటన పూర్తయింది. మరో 8జిల్లాలు తిరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సిద్దమయ్యేందుకు వంద రోజుల పాటు పర్యటనకు శ్రీకారం చుట్టే చర్యల్లో భాగంగా అన్ని జిల్లాలలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు తొలుత ఆ జిల్లాలలోని కీలక నేతలతో సమావేశమవుతున్నారు.