న్యాయమూర్తులు రోడ్డెక్కడాన్ని ఎలా చూడాలి.?

52
భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు మీడియా గోష్టి నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి తీరు బాగాలేదని చెప్పేసారు. ప్రస్తుత సుప్రీంకోర్టు కొలీజియంలో అత్యంత సీనియర్‌ జస్టిస్‌ చలమేశ్వర్‌ నాయకత్వం వహించినట్టు కనిపిస్తుంది. గత చాలా మాసాలుగా సుప్రీంకోర్టు నిర్వహణ కేసుల అప్పగింత, ధర్మాసనాల ఏర్పాటు సక్రమంగా లేవని తాము పదే పదే చెబుతున్నా లేఖ రాసినా, కలిసి మాట్లాడినా చీప్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వైఖరిలో మార్పు రాకపోవడం వల్లనే అసాధారణ నిర్ణయం తీసుకుని దేశం ముందుకొచ్చామన్నారు.
మౌఖికంగా చెప్పకుండా అందచేసిన లేఖ ఆలస్యం కావడంపై మీడియా పదేపదే పలు ప్రశ్నలు వేసినా వారు సూటిగా జవాబివ్వలేదు. దేశానికే మార్గదర్శనం చేసే సీనియర్లుగా ఈ విషయాలు చెప్పడం బాధ్యతగా భావించామన్నారు. చలమేశ్వర్‌తో పాటు రంజన్‌ గోయెల్‌, మదన్‌ భాటియా, కురియన్‌ జోసఫ్‌ మీడియా ముందుకు వచ్చారు. వారు అందజేసిన లేఖ ప్రకారం చూస్తే ప్రధానంగా కేసుల అప్పగింత, ధర్మాసనాల ఏర్పాటు విషయంలో సిజె ఏకపక్షంగా వ్యవహరించడమనేది ప్రధాన విమర్శ. ప్రధాన న్యాయమూర్తి ప్రథముడే తప్ప మిగిలిన వారికంటే ఎక్కువ గానీ తక్కువ గానీ కాదని పేర్కొన్నారు.
న్యాయమూర్తుల నియామక విధానం వెెంటనే ఖరారు చేయాలని ఆర్‌.పి.లూథర్‌ కేసు విచారణలో 27-10-17న ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. ఇప్పటికే సుప్రీంకోర్టు అధికారిక న్యాయవాదులకూ కేంద్రానికి మధ్యన నడుస్తున్న 2016 కేసులో న్యాయమూర్తుల కొలీజియం ఒక పత్రాన్ని పంపినా కేంద్రం స్పందించకపోవటాన్ని ఆమోదించినట్టే భావించాలన్నారు. అత్యంత కీలకమైన ఈ కేసును అవసరమైతే మొత్తం సుప్రీంకోర్టు విచారించాలి తప్ప చిన్నచిన్న ధర్మాసనాలు ఎలా చూస్తాయని ప్రశ్నించారు. ఇంకా అనేక అంశాలలో సిజె సరిగ్గా వ్యవహరించడం లేదు గనక న్యాయప్రక్రియకు నష్టం కలుగుతున్నదని, తమను పిలిపించి మాట్టాడితే వాస్తవాలు చెప్పగలమని ఆ లేఖలో తెలిపారు. మొత్తం మీద పైకి ఇది న్యాయమూర్తుల వివాదంలా కనిపిస్తున్నా వాస్తవంలో కేంద్రానికి న్యాయవ్యవస్థకు సమరంగానే చూడాలేమో..
SHARE