రివ్యూ : పడుతూ..పడుతూ ..ప్రేమ

496

శర్వానంద్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘పడి పడి లేచె మనసు’. హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకుంది. శర్వానంద్‌, సాయి పల్లవిల జంట ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేమంటే..

సినిమా కథ నేపాల్‌లో ప్రారంభమవుతుంది. ఫుట్‌బాల్ ఆడుతూ స్నేహితుల‌తో స‌ర‌దాగా తిరిగే సూర్య (శర్వానంద్) అనుకోకుండా వైశాలి (సాయిప‌ల్ల‌వి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. మెడికో అయిన వైశాలిని ప్రేమ‌లో దించేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తాడు. అత‌ని మ‌న‌సుని చూసి ఎట్ట‌కేల‌కి ప్రేమ‌లో ప‌డుతుంది. పెళ్ళి ప్ర‌స్తావ‌న తీసుకురాగానే ‘ప్రేమలో ఉందాం కానీ… పెళ్ళి వ‌ద్దంటాడు సూర్య‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య బ్రేకప్ అవుతుంది. అస‌లు సూర్య పెళ్లి ఎందుకు వ‌ద్దన్నాడు? విడిపోయిన ఆ ఇద్ద‌రూ క‌లుసుకున్నారా లేదా? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన ఇబ్బందులు ఏంటన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

హను రాఘవపూడి మరోసారి పొయటిక్‌ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కథా కథనాలు నెమ్మదిగా సాగినా విజువల్స్‌, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్‌ తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేసాయి. ఇంటర్వెల్‌ సీన్‌ లో హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. ద్వితీయార్థంలో దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. అక్కడక్కడా కామెడీ వర్క్‌ అవుట్‌ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రేమ‌క‌ల్లో సంఘ‌ర్ష‌ణ కీల‌కం. ద‌ర్శ‌కుడు కూడా ఆ విష‌యంపైనే ప్ర‌ధానంగా దృష్టిపెట్టాడు. ప్రేమ‌జంట‌కి స‌మ‌స్య‌లు వేరొక‌వైపు నుంచి వ‌చ్చిన‌ప్పుడే స‌న్నివేశాలు బాగా పండుతాయి. ఈ సినిమాలో వారికి వారే చిక్కులు కొని తెచ్చుకుంటారు. కానీ ఆ మాత్రం దానికే అప్పుడే ప్రేమ‌లో ప‌డిన జంట విడిపోతుందా? అనే అనుమానాలు ప్రేక్ష‌కుల్లో కలుగుతాయి. మెమ‌రీ లాస్ అంటూ ఓ కొత్త డిజార్డ‌ర్ నేప‌థ్యాన్ని తీసుకొన్నా దాన్ని కూడా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేక‌పోయారు. మొద‌ట అబ‌ద్ధంతో మొద‌లైన ప్రేమ‌క‌థ‌ ద్వితీయార్థంలోకి వ‌చ్చేస‌రికి ఏది అబ‌ద్ధ‌మో, ఏది నిజ‌మో అర్థం కాని ప‌రిస్థితికొస్తుంది.

ఎవరెలా..

శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌విల మరోసారి ప‌రిణ‌తితో కూడిన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండింది. సినిమా ప్ర‌ధానంగా ఈ రెండు పాత్ర‌ల చుట్టూనే తిర‌గ‌డంతో మిగిలిన పాత్ర‌ల‌కి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, సునీల్ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసారు. సాంకేతికంగా సినిమా బాగుంది. జె.కె. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకునేలా ఉంది. రొమాంటిక్‌, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. విశాల్ చంద్రశేఖర్‌ తన సంగీతంతో మ్యాజిక్‌ చేసాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది.

ఫైనల్ గా..

ప్రేమికులు ‘వారే’ ..ప్రేమకధలే ‘రెండు’