విచారణకు ఆదేశిస్తారా.? ఏం లేదని తేల్చేస్తారా.?

68

నరేంద్రమోడీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సహా అనేక అంశాల్లో అచ్చంగా మన్మోహన్ సింగ్ సర్కారు పరిస్థితినే ఎదుర్కొంటోంది.

2జీ స్కాంను కాగ్ బయటపెట్టి కోర్టులో పిటిషన్లు వేసారు. కోర్టు విచారణ చేసి కుంభకోణం లేదని తీర్పు చెప్పింది. ప్రతిపక్షంలో ఉండగా లక్షల కోట్లు దోచేసారని హడావుడి చేసిన భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నా అప్పీల్ కు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అలాంటి స్కాం తరహాలోనే రాఫెల్ స్కాంపై సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తోంది. మోదీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన వివాదాస్పదమైన రాఫెల్ ఒప్పందంపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యం విచారణను సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు ఖరారు చేసుకున్న యుద్ధ విమానాల ధరాల్లో వ్యత్యాస వివరాలను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ వినీత్ అనే న్యాయవాది ఈ పిల్ దాఖలు చేసారు. డసౌ సంస్థ, రిలయన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. గతంలో రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్టే విధించాలంటూ ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఇదివరకే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్‌లను కలిపి రేపు విచారించనున్నారు.

రాఫెల్ ఒప్పందం రూ.40వేల కోట్ల కుంభకోణమంటూ విపక్షాలు ఆరోపించాయి. ప్రభుత్వరంగం సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్‌ను పక్కనపెట్టి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌ను రాఫెల్ డీల్‌లో భాగస్వామిగా చేసేందుకు మోదీ సర్కార్ ఫ్రాన్స్‌పై ఒత్తిడి తెచ్చిందంటూ విమర్శించాయి. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. రంజన్ గగొయ్ రాఫెల్ స్కాంపై దర్యాప్తునకు ఆదేశిస్తే మాత్రం రాజకీయ సంచలనం కావడం ఖాయం.