రివ్యూ .. గ్రాఫిక్స్ రీ-లోడెడ్ ‘2.0’

387

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌ క‌ల‌యిక‌లో వచ్చిన శివాజీ, రొబో చిత్రాలు మంచి విజ‌యాల‌ను సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంగా రూపొందిన చిత్రం ‘2.0’. ఎనిమిదేళ్ళ క్రితం 2010లో విడుద‌లైన రోబో సినిమాకు సీక్వెల్‌గా 550 కోట్ల రూపాయ‌ల‌తో రూపొందిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే..

త‌మిళనాడులో హఠాత్తుగా సెల్‌ఫోన్స్ మాయ‌మ‌వుతూ ఉంటాయి. విష‌యం అర్థం కాక సెంట్ర‌ల్ హోం మినిష్ట‌ర్ సైంటిస్ట్ వ‌శీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌)ని క‌లుస్తాడు. వ‌శీక‌ర‌ణ్, త‌న హ్యుమనాయిడ్ లేడీ రోబో వెన్నెల‌(ఎమీజాక్స‌న్‌)తో క‌లిసి సెల్‌ఫోన్స్ ఏమ‌య్యాయ‌నే దానిపై ఆరా తీస్తూ పోతే ఒక నెగ‌టివ్ ఎన‌ర్జీ వ‌శీక‌ర్ పై దాడి చేస్తుంది. అలాంటి నెగ‌టివ్ ఎన‌ర్జీని త‌ట్టుకోవాలంటే సూప‌ర్ ప‌వ‌ర్ కావాల‌ని అందుకోసం చిట్టిని యాక్టివేట్ చేస్తాన‌ని అంటాడు. పరిస్థితులు చేయి దాటిపోవటంతో చిట్టి రంగంలోకి దిగి అస‌లు నెగ‌టివ్ ఎన‌ర్జీని ఎదుర్కొంటాడు. నెగటివ్ ఎనర్జీ ప్రొఫెస‌ర్ ప‌క్షిరాజు (అక్ష‌య్‌కుమార్) అని తెలుస్తుంది. అస‌లు ప‌క్షి రాజు ఎవ‌రు? సెల్‌ఫోన్స్‌పై ప‌క్షిరాజు ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే..

భూప్ర‌పంచం కేవ‌లం మ‌నుషుల‌ది మాత్ర‌మే కాదు అన్ని జీవరాశులదీ అనే అంశం చుట్టూ ద‌ర్శ‌కుడు క‌థ‌ రాసుకున్నాడు. అయితే క‌థ‌నంలో ట్విస్టులేం లేవు. పక్షుల కోసం పాటు ప‌డే వ్యక్తి వాటితో పాటు వాతావ‌ర‌ణానికి న‌ష్టం క‌లుగుతుంటే చూడలేక ఏం చేసాడ‌నే కథకు సాంకేతిక‌త‌ను జోడించి బోర్ కొట్టించ‌కుండా తెర‌కెక్కించాడు. ఫ‌స్టాఫ్ అంతా వ‌శీక‌ర‌ణ్‌, వెన్నెలగా న‌టించిన ఎమీజాక్స‌న్‌, చిట్టిరోబో చుట్టూనే తిరుగుతుంది. ద్వితీయార్థంలో అక్ష‌య్‌కుమార్‌కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సుదీర్ఘంగా సాగినా క‌థ‌కు అవ‌స‌రం. చిట్టిని అచేతనుడ్ని చేసిన‌ప్పుడు 2.0 ని రంగంలోకి దింప‌డం, చివ‌ర్లో పావురాల‌పై స‌వారీ చేస్తూ మినీ రోబోల్ని దింప‌డం హైలైట్ అయ్యాయి. దాదాపు అర‌గంట పాటు సాగిన క్లైమాక్స్‌ ఔరా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో క‌త్తిరించిన సీన్లు చాలా ఉన్న‌ట్టున్నాయి. మ‌రీ ముఖ్యంగా వ‌శీక‌ర్‌లో ప‌క్షిరాజు ఆత్మ చేరిన త‌ర‌వాత‌ కొన్ని సీన్లు క‌త్తిరించార‌న్న‌ది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. క‌థానాయిక‌ని రోబోని చేసేయటంతో రొమాన్స్ కు అవకాశం దక్కలేదు.

 

ఎవరెలా..

ర‌జ‌నీకాంత్ మొత్తం నాలుగు షేడ్స్‌ లో కనిపించారు. వ‌శీక‌ర్, చిట్టి, వెర్ష‌న్ 2.0తో పాటు మ‌రుగుజ్జు చిట్టి వెర్ష‌న్ 3.0 పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. అక్ష‌య్‌కుమార్ నెగ‌టివ్ ఎనర్జీ ఉన్న ప‌క్షిరాజుగా మెప్పించాడు. లేడీ హ్య‌మ‌నాయిడ్ రోబోగా ఎమీజాక్స‌న్ పాత్ర ప‌రిధి మేర బావుంది. మిగిలిన పాత్రధారులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

ఫైనల్ గా..

కథ రీ-లోడెడ్ ..గ్రాఫిక్స్ రీ-లోడెడ్ ..ఎమోషన్స్ ..నాట్ రీ-లోడెడ్