‘చిట్టి’ చైనాకు వెళుతున్నాడు

79

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై 550 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్‌తో  నిర్మించిన చిత్రం ‘2.0’. ఈ చిత్రం నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా టాక్‌ తెచ్చుకుంది.

మొదటి నాలుగు రోజులకే 400 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్‌ని చైనాలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌, చైనాలోని హెచ్‌వై మీడియాతో కలిసి చైనా భాషలో డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తోంది. హెచ్‌వై మీడియా ఇప్పటికే సోని, ట్వంటియత్‌ సెంచరీ ఫాక్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌, యూనివర్సల్‌, డిస్నీ సంస్థలతో కలిసి ఎన్నో సినిమాలు విడుదల చేసింది.

చైనాలో 10,000 థియేటర్లలో 56,000 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. అందులో 47,000 స్క్రీన్స్‌లో త్రీడి వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. 2019 మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని 2డీ కంటే త్రీడీలో చూసేందుకే మన ప్రేక్షకులు ఇష్టపడుతున్నారట. మ‌రీ ముఖ్యంగా చిన్న పిల్ల‌లు ఈ సినిమాని త్రీడీలో చూడాల‌నుకుంటున్నారు. దానితో పెద్ద‌లూ త్రీడీ టికెట్‌ని తీసుకోవాల్సివ‌స్తోంది. 2డీతో పోలిస్తే త్రీడీ టికెట్టు రేటు ఎక్కువ‌. అందుకే 2.0 వ‌సూళ్ళలో త్రీడీ ప్రభావం బాగానే క‌నిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.