2.0కి ‘త్రీడీ’ డబ్బులు తెస్తోంది

99

మన దగ్గర ‘త్రీడీ’ సినిమా కంటే 2డీలో తీసే సినిమాలు ఎక్కువ. దక్షిణాదిలో అపుడపుడూ ఓం, రుద్ర‌మదేవి లాంటి సినిమాలు త్రీడీలో తీసినా అంతగా ఆదరణకు నోచుకోలేదు.

త్రీడీ అన‌గానే హాలీవుడ్ స్థాయి ఎఫెక్ట్ క‌నిపించ‌క‌పోతే ప్రేక్షకులు పెద్దగా ఉత్సాహం చూపరు. త్రీడీ సాంకేతికత అనగానే బ‌డ్జెట్ కూడా పెరుగుతుంది. అయితే శంక‌ర్ మాత్రం 2.0ని త్రీడీలో రూపొందించాడు. సినిమా ఆల‌స్యం అవ్వ‌డానికి త్రీడీ వెర్ష‌న్ కూడా ఓ కార‌ణం. అయితే ఇప్పుడు త్రీడీ కారణంగానే సినిమాకు ఆదరణ పెరుగుతోంది.

వాస్తవానికి అన్ని క‌థ‌లూ త్రీడీకి ప‌నికిరావు. భారీ యాక్ష‌న్ ఎపిసోడ్లు ఉండాలి. హార‌ర్ సినిమాల‌కు ఈ సాంకేతికత మ‌రింత అనువు. త్రీడీ సక్సెస్ అయితే 2డీ వెర్ష‌న్‌ని చూడ్డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌రు. మనకు త్రీడీ సాంకేతిక అందుబాటులో ఉన్న థియేట‌ర్లు చాలా త‌క్కువ‌. థియేట‌ర్లు త్రీడీకి అనువుగా మారితే సౌండ్ సిస్ట‌మ్ విష‌యంలో అప్‌డేట్ అయితే అప్పుడు త్రీడీల సినిమా నిర్మాణం పెరిగే అవకాశముంటుంది.

2.0కి 2డీ కంటే త్రీడీలో చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారట. మ‌రీ ముఖ్యంగా చిన్న పిల్ల‌లు ఈ సినిమాని త్రీడీలో చూడాల‌నుకుంటున్నారు. దానితో పెద్ద‌లూ త్రీడీ టికెట్‌ని తీసుకోవాల్సివ‌స్తోంది. 2డీతో పోలిస్తే త్రీడీ టికెట్టు రేటు ఎక్కువ‌. అందుకే 2.0 వ‌సూళ్ళలో త్రీడీ ప్రభావం బాగానే క‌నిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సినిమాని 2డీలో చూసిన వారు మరోసారి త్రీడీలో చూడాలి అనుకోవటంతో రిపీటెడ్ ఆడియ‌న్స్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.