రివ్యూ ..నగరంలోకి ‘కొత్త సినిమా’ వచ్చింది

236

పెళ్ళిచూపులు సినిమాతో హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ గ్యాప్‌ తీసుకొని చేసిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’ ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించటంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే..

వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కార్తీక్‌ కు అమెరికాలో సెటిల్‌ అవ్వాలని కలలు కంటుంటాడు. కౌశిక్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్ళి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు. వివేక్‌ దర్శకుడిగా ఎదగటానికి షార్మ్‌ ఫిలింస్ తీసి ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటాడు. ప్రేమ విఫలం కావటంతో మధ్యానికి బానిసై ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటుంటాడు. కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్ళి కుదరటంతో బార్‌లో తాగేసి గోవా వెళ్ళిపోతారు. గోవా చేరిన నలుగురు స్నేహితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నయనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

తరుణ్‌ భాస్కర్‌ ఈ సినిమాను డిఫరెంట్ గా తెరకెక్కించాడు. హాలీవుడ్ కి అలవాటైన టేకింగ్ ను తెలుగు తెరకు పరిచయం చేసాడు. సినిమా అంతా సహజంగా సాగుతుంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సాధారణ కథను ఆసక్తికరంగా తెరమీద చూపించటంలో తరుణ్ భాస్కర్‌ విజయం సాధించాడు. ఫ్రెండ్స్‌ మధ్య జరిగే సన్నివేశాలను ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ప్రేమకథ, బ్రేకప్‌ లను చాలా సాదాసీదాగా తెరకెక్కించాడు. తొలి భాగం కామెడీ సీన్స్‌ తో వేగంగా కథ నడిచినా ద్వితీయార్థం కాస్త నెమ్మదించింది.

స‌న్నివేశాల్లో ఫ్రెష్ నెస్ క‌నిపించింది. వాళ్ల మ‌ధ్య మాట‌లు అత్యంత స‌హ‌జంగా అనిపించాయి. కెమెరా యాంగిల్ ఇలానే పెట్టాలి, ఈ సన్నివేశాన్ని ఇలానే ప్రారంభించాలి, ఇలానే ముగించాలి అనే రూల్సేం పాటించ‌లేదు. దాంతో.. ఈ సినిమాని చూసే కోణం కూడా మారిపోయింది. ల‌వ్ ప్ర‌పోజ‌ల్ సీన్ చూస్తే.. త‌రుణ్ భాస్క‌ర్ స‌హ‌జ‌త్వాన్ని ఎంతగా ఇంజ‌క్ట్ చేయాల‌ని చూశాడో అర్థం అవుతుంది. క‌థానాయ‌కుడి పాత్ర చిత్ర‌ణ‌లో ‘అర్జున్ రెడ్డి’ ఛాయ‌లు క‌నిపిస్తాయి. షార్ట్ టెంపర్, తాగుబోతు, ల‌వ్ ఫెయిల్యూర్‌ ఇవ‌న్నీ వివేక్ పాత్ర‌లోనూ ఉంటాయి. ద్వితీయార్థంలో స‌న్నివేశాల‌పై ద‌ర్శ‌కుడి కంట్రోల్ త‌ప్పిందా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే వివేక్‌, కౌశిక్ మ‌ధ్య తాగుడు స‌న్నివేశం లాంటివి ఇంకో రెండు ఉండి ఉంటె సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. సినిమా అయిపోతోందనుకుంటున్న త‌రుణంలో మరోసారి బాల్యం ఎపిసోడ్ వెళ్ళటం ‘అవ‌స‌ర‌మా’ అనిపించేలా చేస్తుంది.

ఎవరెలా..

సినిమా అంతా నలుగురు కుర్రాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. పెద్దగా పరిచయం లేని ఆ నలుగురూ సహజంగా నటించారు. కౌశిక్ పాత్రలో కనిపించిన అభినవ్‌ చిన్న చిన్న పంచ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు అభినవ్‌. ఇతర పాత్రల్లో సుశాంత్‌, ఉపేంద్రలు తమ పాత్రలకు న్యాయం చేసారు. సిమ్రాన్‌ చౌదరి, అనీషా ఆంబ్రోస్‌ అందం, అభినయంతో ఆకట్టుకున్నారు. వివేక్‌ సాగర్ అందించిన పాటలు పరవాలేదనిపించినా ఉన్నాయి.

ఫైనల్ గా..

ఈ నగరానికి కొత్త సినిమా వచ్చింది.