ఆంధ్రాలో ‘కాంగ్రెస్’తో తెదేపా కలిసిపోయిందట

153
ఆంధ్రాకే చెందిన‌ జీవీఎల్ న‌ర‌సింహారావు హ‌ఠాత్తుగా ఆంధ్రా నేత అయిపోయారు. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళూ ఆంధ్రా స‌మ‌స్య‌లతో ఆయ‌న‌కి ఎలాంటి అనుభ‌వం లేదు. కానీ, ఈరోజు ఏపీ భాజ‌పా నేతగా పార్లమెంటులో రాజ‌కీయ పార్టీల‌ బాధ్య‌త‌ల గురించి, ఏపీలో భాజ‌పా చేసిన అభివృద్ధి గురించి, తెదేపా పాల‌న‌లో లోపాల గురించి మాట్లాడుతున్నారు.
దేశ‌వ్యాప్తంగా భాజ‌పా ఎంపీలు ఒక రోజు నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భాజ‌పా ఎంపీ జీవీఎల్ విజ‌య‌వాడ‌లో దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పార్ల‌మెంటు ఒక పుణ్య‌క్షేత్రం లాంటిద‌నీ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన వేదిక అని చెప్పిన ఆయన పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ప్ర‌తిప‌క్షాలు రౌడీ రాజ‌కీయాలు చేసార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. దానికి నిర‌స‌న‌గా దీక్ష‌లు చేప‌ట్టామ‌నీ, ఆంధ్రాకు హోదాతో స‌మానంగా ఇవ్వాల్సిన‌వ‌న్నీ ఇచ్చేసామ‌ని మ‌రోసారి ఆయ‌న చెప్పారు.
అలా చెప్తూ జీవీఎల్ ‘పార్ల‌మెంటులో వెల్ లోకి వెళ్ళి చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌కుండా చేసిందెవ‌రు..? అని ప్రశ్నించారు. మీరు, మీ ప్రాంతీయ పార్టీలు కాదా అని వ్యాఖ్యానించారు. ఇది ఒక‌టే భార‌తదేశ‌మ‌నీ, అన్ని రాష్ట్రాల‌కూ న్యాయం చేయాల‌న్న‌ది కేంద్రం అభిమ‌తం అని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలుస‌నీ, భ్ర‌మ రాజ‌కీయాలు ఎక్కువ కాలం సాగ‌వ‌న్నారు. తెలుగుదేశం కూడా కాంగ్రెస్ తో క‌లిసిపోయిందని కూడా విమ‌ర్శించారు.
పార్ల‌మెంటులో చ‌ర్చ జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుకున్న‌ది మీ ప్రాంతీయ పార్టీలు కాదా అని జీవీఎల్ ప్ర‌శ్నించ‌డం చూస్తుంటే కాస్త విడ్డూరంగా ఉంది. పార్ల‌మెంటు గొప్ప‌త‌నం గురించి మాట్లాడుతున్న జీవీఎల్ కు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ మీద న‌మ్మ‌కం ఉంటే కేంద్రంపై విప‌క్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు చ‌ర్చించ‌లేకపోయారో మాత్రం చెప్పటం లేదు. ప‌్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన బాధ్య‌త కేంద్రానికి లేదా..? ఇన్నాళ్ళు ఎక్క‌డున్నారో తెలీని జీవీఎల్‌, ఆంధ్రాతో గానీ, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తోగానీ ఏమాత్రం ప‌రిచ‌యం లేని జీవీఎల్‌ సొంత రాష్ట్రం కోసం ఏదో పోరాటం చేస్తున్న క‌ల‌ర్ ఇస్తుంటే ఎలా.?.