రివ్యూ: ఇదొక మహా ‘చరిత్ర’

226

అలనాటి మహానటి ‘సావిత్రి’ జీవిత క‌థ‌తో తెరకెక్కిన మహానటి చిత్రం ప్రేక్షకుల ముందు వచ్చేసింది. రెండో సినిమాగా దర్శకుడు నాగఅశ్విన్ తీసిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే ..

నిశంకర సావిత్రి (కీర్తి సురేష్) ఆర‍్నేళ్ళ వయసులో తండ్రి చనిపోవటంతో పెదనాన్న వెంకట రామయ్య చౌదరి(రాజేంద్ర ప్రసాద్‌) సంరక్షణలో పెరుగుతుంది. చిన్నతనం నుంచి ఏదైనా పని నీ వల్ల కాదు అంటే పంతం కొద్దీ, పట్టు పట్టి ఆ పని చేసి చూపించే అలవాటున్న సావిత్రి నాట్యాన్ని దూరం నుంచి చూసి నేర్చుకుంటుంది. సావిత్రి లోని ప్రతిభను గుర్తించిన అరుణోదయ నాట్యమండలి వారు ఆమెకు నాటకాలలో బాలనటిగా అవకాశం ఇస్తారు. సావిత్రిని సినిమాల్లో నటింప చేయాలని రామయ్య చౌదరి 14 ఏళ్ళ సావిత్రితో చెన్నై చేరుకుంటారు. జెమినీ గణేషణ్‌ (దుల్కర్ సల్మాన్) సావిత్రి అందం చూసి ఎప్పటికైన పెద్ద నటి అవుతుందని అంటాడు. సావిత్రికి ఎల్‌వి ప్రసాద్‌ తన సినిమాలో నాగేశ్వరరావు సరసన హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చినా  అది చేజారిపోతుంది. వెండితెరపై అడుగుపెట్టిన సావిత్రి మహానటిగా ఎలా ఎదిగారు? జెమినీ గణేషణ్ ఆమె జీవితంలోకి ఎలా ప్రవేశించారు? పెళ్ళి తరువాత సావిత్రి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే ..

ఇది పూర్తిగా సావితి కథ. అభిన‌యం ఆమెను మ‌హాన‌టిని చేస్తే ప్రేమ ఆమెను నెత్తురు కక్కుకుని చనిపోయేలా చేసింది. అందుకే ఆమె క‌థ చ‌రిత్ర అయ్యింది. ఆ చరిత్రలో విష‌యాలు, విష వ‌ల‌యాలు ఎన్నో ఉన్నాయ‌ని గ్ర‌హించిన నాగ అశ్విన్‌ ఆమె కథను సినిమా తీయాలని నిర్ణయించుకుని ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. ఓ వ్య‌క్తి జీవితాన్ని సినిమాగా మ‌ల‌చాలంటే ఆ వ్య‌క్తి తాలుకు పెయిన్ కూడా అనుభ‌వించ‌గ‌ల‌గాలి. బ‌యోపిక్ అంటేనే కాస్త క‌ల్ప‌న కూడా జోడించాలి. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త ప‌డ్డాడు. సావిత్రి క‌థ‌ని ప్రేక్ష‌కుల‌కు చెప్ప‌డానికి ఆంటోనీ (విజయ్ దేవరకొండ) – వాణి (సమంత)ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ని వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. సావిత్రి జీవితంలోని ఎత్తుప‌ల్లాల్ని వీలైనంత సున్నితంగా, వివాద ర‌హితంగానే చూపించారు. సావిత్రి మ‌హా న‌టి ఎందుక‌య్యిందో చెప్ప‌డానికి ఉద‌హ‌రించిన సన్నివేశాలు చాలా విపులంగా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు.

తొలి స‌గంలో సావిత్రి న‌టిగా ఎదిగిన తీరు, జెమినీ గ‌ణేశ‌న్‌తో ప్రేమ‌లో ప‌డ‌డం. అత‌న్ని పెళ్ళి చేసుకోవ‌డం తొలి స‌గంలో కీల‌క ఘ‌ట్టాలు. సావిత్రి తిరోగమన ద‌శ ఈ క‌థ‌కు కీల‌కం. సావిత్రి అన‌గానే ఆమె చెడు అల‌వాట్లూ చూపించాలి. ఆ సన్నివేశాల్లోనూ బ్యాల‌న్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆ పాత్ర‌పై సానుభూతి క‌లిగిస్తూ, క‌లిగిస్తూ సావిత్రి ఈ ద‌శ‌లో ఏం చేసినా త‌ప్పు కాద‌ని ప్రేక్ష‌కుడు అనుకునేలా చేసాడు. సావిత్రి కోమాలో ఉంది. ఆమె కోణంలోంచి విషాదాన్ని పండించ‌డం కోసం స‌మంత పాత్ర‌ని వాడుకున్నాడు. ప‌తాక సన్నివేశాల్లో స‌మంత చెప్పిన డైలాగుల‌న్నీ అక్ష‌ర స‌త్యాలు.

ఎవరెలా ..

ఈ సినిమాలోని కీర్తి న‌ట‌న‌ ఆమెను ఎన్నో మెట్లు ఎక్కించింది. కీర్తి సావిత్రిలా మార‌లేదు, అక్ష‌రాలా సావిత్రిని పూనేసింది. సావిత్రి కళ్ళలో అమాయ‌క‌త్వం, చూపుల్లో విషాదం, మాట‌ల్లో మెరుపు, మొహంలో వ‌ర్చ‌స్సు ఇవ‌న్నీ కీర్తిలోనూ క‌నిపించాయి. మ‌హాన‌టి అంటే సావిత్రి గుర్తొచ్చిన‌ట్టు ఈసినిమా చూసాక సావిత్రి అంటే కీర్తి గుర్తొస్తుంది. సావిత్రికి సాయం చేసే ప్రేమికుడిగా తరువాత తనను దాటి సావిత్రి ఎదిగిపోతుందన్న ఈర్ష్యతో కోపం పెంచుకున్న వ్యక్తిగా దుల్కర్ రెండు వేరియేషన్స్‌ ను చాలా బాగా చూపించారు. సావిత్రి కథను నడిపించే కీలక పాత్రలో జర్నలిస్ట్‌ మధురవాణిగా సమంత జీవించింది.  ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్స్‌లో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది.

విజయ్‌ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా మెప్పించారు. అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, కేవీ చౌదరిగా రాజేంద్ర ప్రసాద్‌, ఎస్వీఆర్‌గా మోహన్‌ బాబు, చక్రపాణి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌, కేవీరెడ్డిగా క్రిష్‌, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్‌ భాస్కర్‌, ఎల్‌వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్‌ ఇలా, షాలినీ పాండే, మాళవికా నాయర్, భానుప్రియ, తులసి ఇలా అందరూ తళుక్కున మెరిసారు.

ఫైనల్ గా ..

ఇది కేవలం ఒక సినిమా కాదు ..నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన నట వృక్షం ప్రేమ సోకి నిలువెల్లా నెత్తురు కక్కుకుంటూ నేలకొరిగిన ఒక ‘మహానటి’ జీవితం.