బ్రాహ్మణులను ‘మంచు’ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లేనా..

162
సోమవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం అధ్యక్షుడి(చైర్మన్)గా నటుడు మోహన్ బాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బ్రాహ్మణుల ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు చెప్పారు. ‘బ్రాహ్మణులు నన్ను ప్రేమిస్తే నేనూ వారిని  ప్రేమిస్తా’ అన్నట్టు  మోహన్ బాబు నోటి నుంచి కొన్ని మాటలు బయటకు వచ్చాయి.
అసలు మోహన్ బాబు ఏమన్నారంటే ‘అయ్యా… బ్రాహ్మణోత్తములారా! కమ్మ, రెడ్డి, కాపు, వాళ్ళూ వీళ్ళూ అని ఎలా కులాలు ఉన్నాయో,  మీలో కొన్ని శాఖలున్నాయి. గొడవలొద్దు. నన్ను ప్రేమించండి. మిమ్మల్ని ప్రేమిస్తాను. మా అల్లుడు కూడా బ్రాహ్మణోత్తముడు. కాబట్టి, కలసి మెలిసి పోదాం’. ప్రమాణ స్వీకారం మధ్యలో బ్రాహ్మణుల గురించి అంత నొక్కి వక్కాణించాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా.? అంటే గతంలోకి వెళ్ళాలి.
మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ‘దేనికైనా రెడీ’ విడుదల తర్వాత బ్రాహ్మణులకు, మంచు ఫామిలీకి మధ్య జరిగిన వివాదాలను మంచు కుటుంబం, బ్ర్హ్మనులతో పాటు మిగిలిన వారూ మర్చిపోలేరు. ‘దేనికైనా రెడీ’లో తమను చూపించిన విధానం పట్ల బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేయడం, తర్వాత మంచు విష్ణు చేయి చేసుకునే వరకూ వెళ్ళటం దాకా నానా యాగీ జరిగి మంచు ఫ్యామిలీపై అప్పట్లో బ్రాహ్మణ వ్యతిరేకిగా ముద్ర పడింది. అదంతా మనసులో పెట్టుకుని మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేసారా? అంటే కాదని కూడా చెప్పలేం.
ప్రస్తుతం ‘దేనికైనా రెడీ’ విష్ణు మళ్ళీ బ్రాహ్మణుడిగా నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ‘దేనికైనా రెడీ’ విడుదల సమయంలో జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమా ఎందుకని మోహన్ బాబు అనుకున్నారట. కథలో మంచి సెంటిమెంట్ ఉండడంతో చేసామనీ, బ్రాహ్మణులు గర్వపడేలా ఉంటుందనీ నాగేశ్వరరెడ్డి చెప్తున్నారు. ఏదేమైనా బ్రాహ్మణులతో సఖ్యత కోసం మంచు ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తున్నట్లే ఉంది.