వివాహేతర సంబంధాలు నేరం కాదు

130

వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.

ఐపీసీలోని సెక్షన్‌ 497 రాజ్యాంగవిరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళలను తోటి మనుషులుగా కాకుండా వస్తువులుగా పరిగణిస్తున్నారని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. వైవాహిక జీవితంలో అసంతృప్తికి వివాహేతర సంబంధాలు కారణం కాదని, వైవాహిక జీవితంలో అసంతృప్తి వల్లే ఇలాంటి సంబంధాలు తలెత్తుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.

పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదని ధర్మాసనం వెల్లడించింది. సెక్షన్ 497 ఒక పురాతన చట్టమని, అది ఏకపక్షంగా ఉందని అభిప్రాయపడింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. సెక్షన్ 497తో పాటు సెక్షన్ 198 కూడా రాజ్యాంగ సమ్మతం కాదని వెల్లడించింది. సెక్షన్ 497 మహిళల  సమాన అవకాశాలను కాలరాస్తోందని, సమానత్వ హక్కులను తూట్లు పొడిచేలా ఇది ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

మహిళలను సమానులుగా చూడని ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమేనని, వివాహేతర సంబంధాల్లో పురుషులను మాత్రమే బాధ్యులను చేసే సెక్షన్‌ 497 సరికాదని, మహిళలకు కూడా సమాన హక్కులుంటాయని పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వపు హక్కును ఈ సెక్షన్‌ ఉల్లంఘిస్తున్నట్టు ప్రాథమికంగా కనిపిస్తోందని రాజ్యాంగ ధర్మాసనం గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

వివాహేతర సంబంధాల విషయంలో వివాహితలను మినహాయించి పురుషుడిని మాత్రమే శిక్షించే సెక్షన్‌ 497ను రద్దు చేయాలంటూ జోసెఫ్‌ షైనీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేసాడు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. వివాహేతర లైంగిక సంబంధాలు ఉంటే ఆ పరిణామాలతో సంబంధం లేకుండానే పెళ్ళి రద్దుకు దారి తీసే విధంగా చట్టం ఉందన్నారు.