అక్రమం అంటే పురుషుడేనా.? మహిళకు సంబంధం లేదా.?

389

ఐపీసీ సెక్షన్‌ 497ప్రకారం వివాహేతర బంధం నేరం. కానీ వివాహేతర బంధానికి మహిళ ప్రోద్భలం ఉన్నా, కేవలం పురుషుడికి మాత్రమే శిక్ష విధించాలనే నిబంధన ఉంది. అయితే వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ అన్ని సందర్భాల్లో కేవలం బాధితురాలిగా మాత్రమే పరిగణించబడుతోంది.

ఈ చట్టం ప్రకారం అక్రమ సంబంధం కలిగి ఉన్న పురుషుడికి గరిష్టంగా ఐదేళ్ళ వరకూ జైలు శిక్ష విధించవచ్చు. చట్టం అందరికీ సమానమైనప్పుడు ఇక్కడ మహిళకు ఎందుకు మినహాయింపు అన్న విషయాన్ని గుర్తిస్తూ ఈ సెక్షన్‌ను తొలగించాలని కేరళకు చెందిన జోసెఫ్‌ అనే వ్యక్తి గత డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.

ఒక బంధంలో కేవలం పురుషుడు మాత్రమే ఆకర్షిస్తాడా?. వేరొకరి భార్యతో సంబంధం కలిగి ఉన్న పురుషుడికి మాత్రమే జైలు శిక్ష ఎలా వేస్తారు.? భర్త అంగీకారంతో భార్య వేరొకరితో సంబంధం కలిగి ఉంటే అతన్ని శిక్షించకుండా వదిలేయాలా? అనే ప్రశ్నలను పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు.

పిటిషన్ పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక మహిళను పురుషుడితో సమానంగా సెక్షన్‌ 497 చూడటం లేదని ప్రాథమికంగా నిర్ధారించింది. చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రానికి సెక్షన్‌ 497 కాన్సెప్ట్‌ ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం వివాహేతర సంబంధాల్లో పురుషుడితో సమానంగా స్త్రీని కూడా శిక్షించాలన్న వాదనను కేంద్రం వ్యతిరేకించింది.

ఇలాంటి వ్యవహారాల్లో పురుషుడిని ఖైదు చేసే భారతీయ శిక్షా స్మృతి – సెక్షన్‌ 497ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. సెక్షన్‌ 497ను తొలగిస్తే దేశంలో కల్లోలం జరుగుతుందని అభిప్రాయపడింది. వివాహం అనే పవిత్ర బంధానికి అర్థం లేకుండా పోతుందని పేర్కొంది. సెక్షన్‌ను కొనసాగించడం ద్వారానైనా హద్దులు మరచి ప్రవర్తించే కొంతమందినైనా అడ్డుకోవచ్చని తెలిపింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.