చాలా హ్యాపీ ..’ఎఫ్‌ 3′ సినిమా ఖచ్చితంగా ఉంటుంది

1575

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 2’. దిల్‌ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలై పండగ విన్నర్ గా నిలిచింది.

ఈ నేపధ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘పదేళ్ళ తర్వాత థియేటర్‌కి వెళ్ళి ప్రేక్షకుల రియాక్షన్‌ చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయ్‌. మేమంతా కష్టపడి పనిచేసి సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్‌ ఫీలింగ్‌. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థాంక్స్ చెబుతున్నా. అనిల్‌ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం చాలా రోజుల తర్వాత ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా చేయడం ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. వరుణ్‌ టెర్రిఫిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేయండి’ అన్నారు.

వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘ఎఫ్‌ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు బిగ్‌ థ్యాంక్స్‌. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో పనిచేసారు. అందరికీ థ్యాంక్స్‌. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూసా. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్‌ చేసారు. వెంకీగారితో పనిచేయడం మరచిపోలేను.   త్వరలోనే ‘ఎఫ్‌ 3′  సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, అందరికీ నచ్చే కామన్‌ వ్యక్తి వెంకటేశ్‌గారు’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్‌. ఈ సినిమా కోసం నటీనటులందరూ లైఫ్‌పెట్టి పనిచేసారు. తమన్నా, మెహరీన్‌ చాలా బాగా నటించారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్‌ చాలా కష్టపడి చేసాడు. మళ్ళీ మళ్ళీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్‌ అబ్బ. వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్‌ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్‌ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్‌. ‘ఎఫ్‌ 3′ సినిమా ఖచ్చితంగా ఉంటుంది’ అన్నారు.

దిల్‌ రాజు మాట్లాడుతూ ‘మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ  సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్‌ అంతా చాలా ఎంజాయ్‌ చేస్తున్నాం. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్‌ వచ్చింది. ఈ సినిమా హిట్‌ అవుతుందనుకున్నా, కానీ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని నేను కూడా ఊహించలేదు. మా బ్యానర్‌కి హయ్యస్ట్‌ ప్రాఫిట్‌ తెచ్చిన సినిమా ఇదే, చాలా హ్యాపీ’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, మెహరీన్, దేవిశ్రీ ప్రసాద్, అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ తదితరులు మాట్లాడుతూ ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.