ఏం చేసినా కర్ణాటక ఎన్నికల తర్వాతే..

76

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా నినాదాన్ని అన్నిపార్టీలూ , పార్టీయేతర సంఘాలూ కూడా తమ తమ పద్దతుల్లో వినిపిస్తున్నాయి. రకరకాల ఆందోళనలు నిరసనలు సాగుతున్నాయి. కాని భాజపా మాత్రం రాజకీయంగా మాట్లాడటమే చేస్తోంది. కేంద్రంలోని మెడీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం ఏపీ భాజపా నేతలకే ఆశ్చర్యం కలిగిస్తున్నది.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చెప్పిందే చెప్పి సమర్థించుకోవడం సమస్యగా మారిందని కూడా అభిప్రాయపడుతున్నారు. మోడీ, చంద్రబాబు వైరుధ్యాలు ఎలా వున్నా ఇంత ఉపేక్ష దేనికని నిట్టూరుస్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల పోరాటం ముగియగానే ప్రధాని ఏపిపై దృష్టి సారిస్తారని కొందరు చెపుతున్నారు. హోదా, ప్యాకేజీ వంటివి పక్కనపెట్టి జిల్లాల వారిగా కేంద్ర మంత్రులు జాతీయ నాయకులూ పర్యటిస్తారట.

భాజపా జాతీయ అద్యక్షుడు అమిత్‌ షా కడపతో సహా రాయలసీమ జిల్లాలకు వస్తారని అంటున్నారు. మొదట మోడీ వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రకటన చేస్తారనుకున్నారు గాని ఆయన స్థాయికి తగిన జనసమీకరణ కష్టమనే సంకోచం అడ్డుపడింది. అమిత్‌ షా అయితే మధ్యే మార్గంగా వుండొచ్చని భావిస్తున్నారు. ఏపి భాజపా అద్యక్షుడి ఎంపిక కూడా కర్ణాటక తర్వాతే ఎజెండాలోకి వస్తుందంటున్నారు. కర్ణాటకలో 45 నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం గణనీయంగా ఉంటుందని అంచనా.

ఏపీ తెలుగుదేశం, కాంగ్రెస్‌ నాయకులు భాజపాకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం నష్టం కలిగిస్తున్నదనీ, భావించిన భాజపా ఏపి నాయకులను ఇందుకు వ్యతిరేకంగా రంగంలోకి దించి ఉపయోగించుకోవాలని వ్యూహం చేస్తుందట. మూడు మాసాలుగా చాలామంది తెలుగు నేతలు అక్కడే ఉండిపోయారట. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అద్యక్షుడిని నియామకం పక్కన పెడితేనే. శ్రేయస్కరమని అధిష్టానం భావిస్తున్నది. దీనితో ఏపికి సంబంధించిన వ్యవహారాలన్నీ కర్ణాటక ఎన్నికల ముగిసేవరకూ పక్కన పెడతారని సమాచారం.