‘అజ్ఞాతవాసి’ రాసింది ..తీసింది ..త్రివిక్రమేనా.?

102
మూడోసారి త్రివిక్ర‌మ్-పవన్ కాంబో అనగానే ప‌వ‌న్ అభిమానులు ఒక అద్భుతాన్నే ఆశించారు. కానీ ‘అజ్ఞాతవాసి’తో త్రివిక్ర‌మ్ వారికి కనీసం అనుభూతి అందించ‌లేక‌పోయాడు. సినిమాలో లోపాలను రివ్యూల్లో స‌మీక్ష‌కులు ఎత్తి చూపుతున్నారు. సినిమా అంతా చూసాక స్ర్కిప్ట్ ద‌శ‌లో, దాని తీత‌లో దర్శకుడి నిర్ల‌క్ష్యం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది. అదే త్రివిక్రమ్ లో.. క‌థ‌, క‌థ‌నాల్లో లోపాలు, లాజిక్కులు, త‌ప్పులు ఎవ‌రైనా చేస్తారు. కానీ నిర్ల‌క్ష్యం మాత్రం సరయినది కాదు. ఏం రాస్తే అదే.. పంచ్‌ అనుకుంటే ఎలా.?
ఈ సినిమాలో త్రివిక్ర‌మ్‌లో ఆ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ ఆయనలోని రచయిత ద‌ర్శ‌కుడ్ని డామినేట్ చేస్తూనే ఉంటాడు. కానీ ఈసారి ర‌చ‌యిత మెరవలేకపోయాడు. కార‌ణం త్రివిక్ర‌మ్ రాసిందే ఆయ‌న సినిమాల్లో ఉంటుంది, సార్.. ఇంకోలా ఆలోచిద్దామనే వాళ్ళు ఆయన పక్క‌న లేరు. ఉన్న కొద్ది మంది త్రివిక్ర‌మ్‌కి చెప్ప‌డానికి ధైర్యం చేయలేరు. బిగి లేకుండా న‌డిపేసిన స‌న్నివేశాలు అజ్ఞాత‌వాసిలో చాలానే ఉన్నాయి. వాటిలో సైకిలెక్కి బెల్ట్ ప‌ట్టుకొని కొట్టే సీన్ అయితే దాదాపు 5 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగే స‌న్నివేశం అది. అక్క‌డ త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌గా విఫ‌ల‌మ‌య్యాడు. ప‌వ‌న్ తో అల్ల‌రి చిల్ల‌ర వేషాలు వేయించ‌డం, అమ్మాయిలా ఫోన్లో మాట్లాడించ‌డం చాలా ఓవ‌ర్‌గా అనిపించాయి. ప‌వ‌న్ అభిమానులు కూడా సినిమా చూసాక ఇలానే ఫీలయ్యారు.
పైత్యం ఎవరిది అనేది పక్కనపెడితే త్రివిక్ర‌మ్ ఎందుకు అలా చేసాడు? త్రివిక్ర‌మ్ ఏం చెబితే ప‌వ‌న్ అది చేసాడా? లేదంటే ప‌వ‌న్ చెప్పినట్లు త్రివిక్ర‌మ్ న‌డిచాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అటూఇటూగా ఉండే త్రివిక్ర‌మ్ ఖ‌లేజాలో కూడా త్రివిక్ర‌మ్ శైలి, పంచ్ డైలాగులు అద్భుతంగా ఉంటాయి. టీవీలో వచ్చినప్పుడల్లా చూడాలనిపిస్తుంది. అజ్ఞాతవాసిలో అది లేదు. ఏ కోశానా కనిపించలేదు. ఈ సినిమాకి మాట‌లు త్రివిక్ర‌మే రాసాడా అనిపించిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఒక్క స‌న్నివేశాన్ని కూడా త‌న మ్యాజిక్‌తో నిల‌బెట్టలేక‌పోయాడు త్రివిక్ర‌మ్‌.
క‌థానాయిక‌లిద్ద‌రూ చెంప‌దెబ్బ‌లు కొట్టుకునే స‌న్నివేశాన్ని త్రివిక్ర‌మ్ లాంటి విజ్ఞాని ఊహించాడంటే నమ్మలేం. త్రివిక్ర‌మ్ కలంలోని మెరుపు త‌గ్గింద‌న‌డానికి ఆ సీన్ నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ఏ సీన్ తీసుకున్నా త్రివిక్ర‌మ్ తాలుకూ నిర్ల‌క్ష్యం అణువ‌ణువూ క‌నిపిస్తుంది. ఈ సినిమాలో త్రివిక్ర‌మ్ రాసిన డైలాగ్‌ ఒకటి చెప్పుకుంటే ..మళ్ళీ మళ్ళీ ఎదురైతే అనుభూతి ..ఒక్కసారి జరిగితే అద్భుతం.. ఇక్కడ అద్భుతాలు లేవు ..అనుభూతులు లేవు.
SHARE