రివ్యూ ..అభిమానుల కోసమే ‘అజ్ఞాతవాసి’

79
ప‌వ‌న్ కళ్యాణ్  25వ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప‌వ‌న్  అజ్ఞాతవాసిగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సంక్రాంతి పండుగ సీజన్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే ..  
కథేమంటే ..
వ్యాపార వేత్త గోవింద్ భార్గ‌వ్ అలియాస్ విందా(బొమ‌న్ ఇరానీ) ఏబీ సంస్థ‌ల‌కు అధిప‌తి. కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విందాని, అత‌ని త‌న‌యుడిని చంపేస్తారు. దాంతో వారసులు లేరని బాధపడకుండా విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కంపెనీ వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం అస్సాంలో ఉండే బాల‌సుబ్ర‌మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ల్యాణ్‌)ని మేనేజ‌ర్‌గా నియ‌మిస్తారు. బాల‌సుబ్ర‌మ‌ణ్యం మేనేజ‌ర్‌గా వ్య‌వ‌హారాలు చేసుకుంటేనే విందా హ‌త్య‌కు కార‌కులెవ‌ర‌నే దానిపై ఆరా తీస్తుంటాడు. విందా హంతకులు ఎవరు.? బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభివ్య‌క్త భార్గ‌వ‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? సీతారామ్‌(ఆదిపినిశెట్టి)కు ఆ హత్యలకు ఏమిటి సంబంధం? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే ..

ఈ సినిమా పూర్తిగా పవన్‌ కళ్యాణ్ సినిమా. కార్పొరేట్‌ ప్రపంచంలో ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, ఎత్తులు, పైఎత్తులు మొదలైన అంశాల చుట్టూ కథ నడుస్తుంది. కథను నడిపించేందుకు పురాణ, ఇతిహాసాల్లోని అంశాలను నేపథ్యంగా తీసుకున్నాడు. ఉదాహరణకు ‘నకుల ధర్మం’ ప్రస్తావన అందులోని భాగమే. కూర్చునే కుర్చీ తయారవడానికి జరిగే మినీ యుద్ధం గురించి తొలి సన్నివేశాల్లో చెప్పటంతోనే సినిమా కూడా పోరాటం దిశగా సాగుతుందని అర్థమవుతుంది. అలాంటి యుద్ధానికి కుటుంబ బంధాలు, పిట్ట కథల్లాంటి ప్రేమ వ్యవహారం, కొన్ని వినోద సన్నివేశాలను జోడించారు. కథను నెమ్మదిగా ప్రారంభమై చిక్కుముడులతో విరామ సన్నివేశాలకు చేరుతుంది. అసలు కధ ద్వితీయార్ధంలోనే మొదలవుతుంది. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. విందా కంపెనీలో శర్మ(మురళీశర్మ) వర్మ(రావురమేష్‌)ల పాత్రలతో హాస్యాన్ని పండించే ప్రయత్నం చేసాడు. త్రివిక్రమ్‌ శైలి కామెడీ అందరికీ నవ్వులు పంచుతుంది. పతాక సన్నివేశాలను తనదైన మార్కు జోడించి తీర్చిదిద్దాడు త్రివిక్రమ్‌. పవన్‌ పాడిన ‘కొడకా కోటేశ్వరరావు’ నవ్వుల పువ్వులు పూయిస్తుంది.

ఎవరెలా ..

క‌థ మొత్తం ప‌వ‌న్‌ చుట్టూనే తిరిగింది. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిష‌క్త భార్గ‌వ అనే రెండు షేడ్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. పవన్ తన శైలితో సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై మోసాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ప‌వ‌న్ అభిమానులను మెప్పించాడు. ఖుష్బూ ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగ‌మైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. ఇక విల‌న్‌గా ఆది పినిశెట్టి త‌న పాత్ర‌కు న్యాయం చేసాడు. అయితే ఇంకా బ‌లంగా డిజైన్ చేసుంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేట్ అయ్యుండేది. ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ పాత్ర‌లు కామెడీకి ప‌రిమితం.

ఫైనల్ గా ..
క‌థ, క‌థ‌నంపై కేర్ తీసుకుని ఉంటే బావుండేద‌నిపించింది. పెద్ద కంపెనీల మ‌ధ్య పోరు, ఎత్తులు, పై ఎత్తులు.. హీరో వ‌చ్చి కుటుంటాన్ని కాపాడుకోవడం వంటి స‌న్నివేశాలను ప్రేక్ష‌కులు చూసేసారు. ఓ ద‌శ‌లో ప్రేక్ష‌కుడికి మెయిన్ కాన్సెప్ట్ అర్థ‌మైపోయి క‌థ‌పై ఉన్న ఆస‌క్తి త‌గ్గిపోతుంది.

 

SHARE