స్టైలిష్ గా పదిహేనేళ్ళు పూర్తి చేసేసాడు

227
‘గంగోత్రి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ ని ‘వీడేంటి? హీరో ఏంటి? అనే చాలా మంది ఎటకారం చేసిన వాళ్ళున్నారు. 15 ఏళ్ళు అయిపోయాయి.. అల్లు అర్జున్ ఇప్పుడు స్టైల్‌కి ఐకాన్‌ డాన్స్‌కి గురు. ‘ఎద‌గ‌డం’ అంటే ఇదే.. ‘నేర్చుకోవ‌డం’ అంటే ఇదే. నా వెనుక నాన్న ఉన్నాడులే.. గీతా ఆర్ట్స్ ఉందిలే అనుకుంటే బ‌న్నీ ‘గంగోత్రి’ ద‌గ్గ‌రే ఉండిపోయేవాడు.
తొలి సినిమాలోనే త‌న త‌ప్పులు అర్థ‌మైపోయాయి. త‌న లోపాలు క‌నిపించేసాయి. వాటిని ఒప్పుకుని, త‌ప్పులు దిద్దుకుని, మ‌రో స‌రికొత్త బ‌న్నీని చూడ్డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. ‘ఆర్య‌’ వ‌చ్చేసి డాన్సులు, న‌ట‌న‌, ఎమోష‌న్స్‌ ఇవ‌న్నీ ‘చిత్ర‌సీమ‌కు మ‌రో స్టార్ హీరోని ఇచ్చేసింది. వ‌రుస హిట్లు వచ్చినా అల్లు అర్జున్ మాత్రం త‌న‌ని తాను వెదుక్కుంటూ, నేర్చుకుంటూ ప్ర‌యాణం చేశాడు. హ్యాపీ, ప‌రుగు, వేదం లాంటివి చతికిలపడినా అవి చూసినపుడు బ‌న్నీ లో అద్భుత‌మైన న‌టుడు దాగున్నాడ‌ని, త‌న‌లో త‌వ్వుకోవాల్సిన ప్ర‌తిభ ఇంకా ట‌న్నుల కొద్దీ ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది.
ప్ర‌తీ సినిమాలోనూ స్టైల్‌ని జోడించ‌డం మ‌ర్చిపోలేదు. డ్ర‌స్సింగ్‌, డాన్సింగ్ అన్నిటా వంద‌కు వంద మార్కులే. ఇదే స్టైల్‌కి మ‌ల‌యాళం చిత్ర‌సీమ కూడా దాసోహం అయిపోయింది. అక్క‌డ మ‌ల్లూ స్టార్‌గా మారిపోయాడు. ‘రుద్ర‌మ‌దేవి’లో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌ స‌రికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. తెలంగాణ యాస‌లో బ‌న్నీ చెప్పిన డైలాగుల‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. స‌రైనోడుతో తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఓ సూప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌న ఖాతాలో వేసుకోగ‌లిగాడు.
ప‌దిహేనేళ్ళ ప్ర‌యాణాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేసి… ప్ర‌తీ సినిమాతోనూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు ‘నాపేరు సూర్య‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. మే 4న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ‘సూర్య‌’ కోసం నిజ‌మైన ఆర్మీ ఆఫీస‌ర్‌లా మారాడు. ఈ ప‌దిహేనేళ్ళ ప్ర‌యాణానికి గుర్తుగా సూర్య అద్భుత విజ‌యాన్ని అందుకోవాలి. ఆల్ ద బెస్ట్‌… బ‌న్నీ!!