ఒకరిపై సున్నితం ..మరొకరిపై పూనకం

170
వైకాపా నాయ‌కులు ఢిల్లీ వేదిక‌గా ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉద్య‌మాన్ని సాగించామ‌నీ,  రాష్ట్రంలో పోరాడుతున్నాం అని చెప్తున్నా ఇటీవల కాలంలో హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్నీ, ప్ర‌ధానినీ విమ‌ర్శించిన దాఖ‌లాలు కనిపించవు. పార్ల‌మెంటులో మోడీ స‌ర్కారుపై అవిశ్వాసం పెట్టారే కానీ విమర్శలు మాత్రం చేయలేదు.
తాజాగా వైకాపా నేత అంబ‌టి రాంబాబు వైకాపా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.  ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంఘాలు, జ‌న‌సేన, వామ‌ప‌క్షాలు ఇచ్చిన ఏపీ బంద్ పిలుపును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అప‌హాస్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఇదే సంద‌ర్భంలో మోడీ గురించి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి కూడా ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసే విధంగా  నిరాహార దీక్ష చేసారని, అయితే అది తన అభిప్రాయం మాత్రమే అని నొక్కి చెప్పారు. ఈ దేశాన్ని పాలించాల్సిన వ్య‌క్తి, పార్ల‌మెంటును న‌డ‌పాల్సిన బాధ్య‌త ఉన్న ప్ర‌ధాన‌మంత్రి వారి వైఫ‌ల్యాన్ని ప్ర‌తిప‌క్షాల‌పై నెట్టేసే ప్ర‌య‌త్నం చేసార‌న్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌య‌త్నించే విధంగా ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రించడం దురదృష్ట‌క‌ర‌మైన ప్ర‌య‌త్నం అన్నారు.
ఇక్క‌డి నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టార్గెట్ చేసారు. ఏపీలో బంద్ కి పిలుపునిస్తే దాన్ని అప‌హాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడార‌నీ, బందులు వేరే విధంగా చెయ్యాల‌ని చెప్పి ఆయ‌న విదేశాల‌కు వెళ్ళిపోయారన్నారు. గ‌తంలో కూడా ఇలానే వెళ్ళార‌నీ, కానీ సాధించింది శూన్యమ‌ని ఎద్దేవా చేసారు. మ‌నదేశంలో అనేక త‌రాల నుంచి నిర‌స‌న‌లు తెలిపే సంప్ర‌దాయం ఉంద‌నీ, బంద్ ద్వారా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని కేంద్ర ప్ర‌భుత్వాల‌కు తెలిపే ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నామంటూ చెప్పారు. ఆయ‌న త‌ల్చుకుంటే కేంద్ర ప్ర‌భుత్వాల వాహ‌నాలు నిలిచిపోతాయ‌ని చంద్ర‌బాబు అన్నార‌నీ, అలా ఆపితే ఎవ‌రైనా ఊరుకుంటారా అంటూ  కేంద్రం వైపు మాట్లాడారు.
ఆ మీడియా సమావేశం చూస్తే ప్ర‌ధాన‌మంత్రి గురించి చాలా సున్నితంగా విమ‌ర్శిస్తూ ఎక్క‌డా ఎలాంటి భావోద్వేగానికి లోను కాలేదు. కానీ, చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు మొద‌లుపెట్ట‌గానే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోయారు. ఎందుకో మరి..