తెలంగాణ కోసం అమిత్ షా వ్యూహం ఏమిటో.?

50

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కొన్ని రాష్ట్రాల‌ను ఎంపిక చేసుకుని వాటిపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. బ‌లోపేతం అయ్యేందుకు బాగా అవ‌కాశమున్న రాష్ట్రాల‌పై దృష్టి పెట్టారు. ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లోని 120 ఎంపీ సీట్ల‌పై భాజ‌పా క‌న్నేసింది.

అందుకు అనుగుణంగా అమిత్ షా ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకున్నారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమైన ప‌ర్య‌ట‌న‌లు వ‌చ్చే నెల 20వ‌ర‌కూ సాగుతాయి. ఈ నెల 22న తెలంగాణ‌కు రానున్నారు. అమిత్ షా హైద‌రాబాద్ వ‌చ్చి దాదాపు ఏడాది అవుతోంది. అదిగో ఇదిగో వ‌స్తారంటూ చాలా హ‌డావుడి చేస్తూ వ‌చ్చారు కానీ, జ‌ర‌గ‌లేదు. దాదాపు ఏడాదిగా తెలంగాణ భాజ‌పాలో కొంత స్త‌బ్ద‌త నెల‌కొని ఉన్న మాట వాస్తవం.

ఫెడ‌ర‌ల్ ఫ్రెంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టే వ‌ర‌కూ తెరాస‌పై ఎలా స్పందించాల‌నే స్ప‌ష్ట‌త భాజ‌పా నేత‌ల‌కు లేద‌నే చెప్పాలి. తెరాస‌పై ఎలాంటి వైఖ‌రి అనుస‌రించాలా అనే గంద‌ర‌గోళ‌మే ఉంది. గ‌డ‌చిన ఏడాదిపాటు ఏవో కొన్ని యాత్రల్లాంటివి రాష్ట్ర నాయ‌క‌త్వం చేస్తూ వ‌చ్చిందే త‌ప్ప‌ పార్టీ అనూహ్యంగా బ‌లోపేతం అయ్యేందుకు కావాల్సిన కార్య‌క్ర‌మాలేవీ చేప‌ట్టలేదు.

అమిత్ షా రాక‌తో రాష్ట్రంలో పార్టీకి స్ప‌ష్ట‌మైన దిశా నిర్దేశం ఏర్ప‌డుతుంద‌నీ, వ్యూహాలు ఖ‌రారు అవుతాయ‌ని రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ అంటున్నారు. ఎంపీ స్థానాల‌తోపాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై కూడా అనుస‌రించాల్సిన కార్యాచ‌ర‌ణపై కూడా స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంద‌ని ల‌క్ష్మ‌ణ్ అంటున్నారు. ముందుగా తెలంగాణ భాజ‌పాలో పేరున్న నాయ‌కులు కావాల్సిన అవ‌స‌ర‌ముంది. మరి తెలంగాణలో భాజ‌పా విస్త‌ర‌ణ‌కు అమిత్ షా ఎలాంటి విజ‌న్ తో వస్తారో చూడాలి.