సులభతర వాణిజ్యంలో ఏపీకి అగ్రస్థానం

103

సులభతర వాణిజ్య ర్యాంకులను కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలును ప్రాతిపదికగా ప్రపంచ బ్యాంక్ తో కలిసి కేంద్రం ఈ ర్యాంకుల్ని ప్రకటిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 98.42 శాతం ప్రగతి సూచీని నమోదు చేసింది.

తెలంగాణ 98.33 శాతం ప్రగతి సూచితో రెండో స్థానంలో నిలిచింది. సరళతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పాయింట్లలో చాలా స్వల్ప తేడానే ఉంది. మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్ నిలిచాయి. రాష్ట్రాలను టాప్ అచీవర్స్, అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్ గా విభజించి ర్యాంకుల్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ టాప్ అచీవర్స్ స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్య సదస్సులు, ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వేల కోట్ల రూపాయల మొత్తంలో ఒప్పందాలు చేసుకోవడంతో సులభతర వాణిజ్య విధానంలో అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రం తెలిపింది.

వాణిజ్యంలో పోటీతత్వాన్ని పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతో రూపొందించిన ప్రణాళిక ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’. వ్యాపార, పెట్టుబడి అనుకూల సంస్కరణలు వేగంగా కొనసాగించడానికి ప్రపంచబ్యాంక్ తో కలిసి.. కేంద్రం ఈ ర్యాంకులు ఇస్తోంది. ఈ ర్యాంకుల్ని డీఐపీపీ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూంటారు. ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి మే మధ్య కాలంలోని డాటాను పరిగణనలోకి తీసుకొంటారు.

విభజన తర్వాత మౌలిక సదుపాయాలు లేనప్పటికీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. కియా, హీరో, అశోక్ లేలాండ్ వంటి ఆటోమోటివ్ కంపెనీలు, ప్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ సీఎల్ వంటి ఐటీ కంపెనేలు, షావోమి, ఫాక్స్ కాన్ వంటి  మొబైల్ కంపెనీలు ఏపీ వైపు చూసాయి. దీనితో తెలంగాణ కూడా ఏపీతో పోటీ పడుతోంది.