రివ్యూ : ‘సర్కార్’ లాజిక్ మిస్సయ్యాడు

432

కోలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ విజయ్ తెలుగునాట మార్కెట్ సాధించినా ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రం చేయలేకపోయాడు. తుపాకి, అదిరింది లాంటి సినిమాలు ఫరవాలేదనిపించాయి. తాజాగా మరోసారి మురుగదాస్‌ దర్శకత్వంలో ‘సర్కార్’ సినిమాతో వచ్చాడు. గతంలో వీరి ‘తుపాకి, కత్తి’ సినిమాలు విజయం సాధించటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ‘సర్కార్‌’తో విజయ్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా.? చూద్దాం.

కథేమంటే..

ప్రవాస భారతీయుడు సుందర్‌ రామస్వామి (విజయ్‌) ప్రముఖ కంపెనీకి సీఈఓగా సంవత్సరానికి 1800 కోట్లు సంపాదిస్తుంటాడు. ఏ దేశంలో అడుగుపెట్టినా అక్కడి కంపెనీలను దెబ్బతీసి, వాటిని మూసేయించే కార్పోరేట్‌ క్రిమినల్‌. సుందర్‌ భారత్‌కు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తాడు. ఓటు వేయడానికి వెళ్ళిన సుందర్‌కు తన ఓటును ఎవరో దొంగ ఓటు వేసారని తెలుస్తుంది. దీంతో తన ఓటు కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. సుందర్‌ ఓటు హక్కు వినియోగించుకునే వరకు అక్కడ ఎలక్షన్‌ కౌంటింగ్ ఆగిపోతుంది. సుందర్‌ విషయం తెలిసి ఓటు వేయలేకపోయిన దాదాపు 3 లక్షల మందికిపైగా ప్రజులు అదే తరహాలో కేసుల వేస్తారు. దీంతో ఎన్నికలను రద్దు చేసి తిరిగి 15 రోజుల్లో ఎన్నికల నిర్వహించాలని కోర్టు తీర్పునిస్తుంది. అధికార పార్టీ నేతలతో గొడవల కారణంగా సుందర్‌ స్వయంగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. కార్పోరేట్ క్రిమినల్‌ సుందర్‌ కరుడు గట్టిన రాజకీయనాయకులతో ఎలా పోరాడాడు? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

‘స‌ర్కార్‌’లో క‌థానాయ‌కుడికి ఎదురులేదు. అత‌ని తెలివితేట‌ల్ని, ఎత్తుగ‌డ‌ల్ని తిప్పి కొట్టే మొన‌గాడు క‌నిపించ‌డు. ఓ బిలియ‌నీర్ త‌న ఓటు హ‌క్కు కోసం ఇండియా రావ‌డం, త‌న ఓటు గ‌ల్లంత‌వ్వ‌డం, దాన్ని సాధించుకునే క్ర‌మంలో పోరాటానికి దిగ‌డం ఇవ‌న్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. హీరో ఇమేజ్‌ని బాలెన్స్ చేసుకుంటూ ఇలాంటి క‌థ‌ల్ని చెప్ప‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. పైగా రాజ్యాంగం, చ‌ట్టం, ఆర్టిక‌ల్స్ ఇలా థియ‌రిటిక‌ల్ అంశాలు చాలా ఉన్నాయి. వాట‌న్నింటినీ సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. విజయ్‌ మార్క్‌ స్టైల్స్‌, మాస్‌ అప్పీల్ కనిపించినా.. మురుగదాస్‌ గత చిత్రాల్లో కనిపించిన వేగం లోపించినట్టుగా అనిపిస్తుంది. కార్పోరేట్ క్రిమినల్‌, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడనే పాయింట్ తో  దర్శకుడు కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు.

ఫస్ట్‌హాఫ్‌ యాక్షన్ సీన్స్‌, పొలిటికల్‌ పంచ్‌ డైలాగ్‌లతో ఇంట్రస్టింగ్‌గా నడిపించిన దర్శకుడు సెకండ్‌ హాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. కథనం సాధాసీదాగా సాగుతుంది. విజయ్‌ అభిమానులను మాత్రం మురుగదాస్‌ పూర్తి స్థాయిలో అలరించాడనే చెప్పాలి. హీరో ఇమేజ్‌ని కాపాడే ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కుడు సినిమాటిక్ లిబ‌ర్టీ చాలా తీసేసుకున్నాడు. ఓ ద‌శ‌లో.. మురుగదాస్ క‌థ‌ని సైతం హీరో ఇమేజ్ డామినేట్ చేస్తుంటుంది. కోమ‌ల‌వ‌ల్లి (వ‌ర‌ల‌క్ష్మి) పాత్ర ద‌ర్శ‌కుడి బ్రిలియ‌న్స్ చూపిస్తుంది. హీరోయిన్‌ పాత్ర కేవ‌లం జూనియ‌ర్ ఆర్టిస్టులా నిల‌బ‌డి ఉంటుంది. త‌మిళ నాట ప్రేక్ష‌కులు పొలిటిక‌ల్ సినిమాల్ని బాగా ఆద‌రిస్తారు. వారికు కావ‌ల్సిన అంశాలు ఇందులో క‌నిపిస్తాయి కూడా.

ఎవరెలా..

విజయ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గతంలో ఎన్నడూ కనిపించనంత స్టైలిష్ లుక్‌ లో కనిపించాడు. మహానటిగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో ఏమాత్రం ప్రాదాన్యం లేని పాత్రలో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఒకటి రెండు సన్నివేశాలు తప్ప కీర్తి సురేష్ ఎక్కడా పెద్దగా కనిపించదు. వరలక్ష్మి ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకుడి పాత్రలో రాధారవి మరోసారి తన అనుభవాన్ని చూపించారు. ఇతర పాత్రల్లో కనిపించిన వారంతా తమిళ వారే.