రివ్యూ: ‘అరవింద’తో రాఘవుడు మెప్పిస్తాడు

175

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు ఎంతగా ఎడురుచూసారో, ఎన్టీఆర్‌- త్రివిక్రమ్‌లు కూడా అంత కంటే ఎక్కువగానే ఎదురు చూసారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి డిజాస్టర్‌ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కావటంతో ‘అరవింద సమేత’పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. టీజర్‌, ట్రైలర్‌ పెంచిన అంచనాలను సినిమా అందుకుందా..? చూద్దాం.

కథేమంటే..

రాయలసీమలో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య 30ఏళ్ళుగా ఫ్యాక్షన్ కక్షలు రగులుతూ ఉంటాయి. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతిబాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). పేకాట వద్ద మొదలైన ఐదు రూపాయల ఫ్యాక్షన్ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలై ఒకరినొకరు చంపుకునే వరకూ వెళతాయి. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని  నారపరెడ్డి కుమారుడు వీర రాఘవ రెడ్డి (ఎన్టీఆర్) ఊరికి తిరిగి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ తిరగబడి అందరినీ నరికేస్తాడు. నాయినమ్మ (సుప్రియ పాథక్) చెప్పిన మాటలతో ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్ళిపోతాడు. అక్కడ గ్యారేజీ నడుపుతున్న నీలాంబరి (సునీల్)తో స్నేహం మొదలవుతుంది. తమ కేసు ఓడిపోయిన క్రిమినల్ లాయర్ (నరేష్) మీద కోపంతో ఉన్న రౌడీ బ్యాచ్ అతని కూతురు అరవింద (పూజా హెగ్డే)ను కిడ్నాప్ చేయాలని ఆమె వెంట పడతారు. వీర రాఘవ ఆమెను ఆ ప్రమాదం నుంచి కాపాడటంతో అరవింద తండ్రి రాఘవను కూతురికి బాడీగార్డ్ లా ఉండమని చెపుతాడు. అక్కడితో కథ మలుపు తిరుగుతుంది. ఈ ప్రయత్నంలో వీర రాఘవకు ఎదురైన సమస్యలేంటి..? రెండు గ్రామాల మధ్య పగలు చల్లారాయా? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

త్రివిక్రమ్, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కథ తెలిసిందే కావటం కొంత నిరాశ కలిగిస్తుంది. సినిమా తొలి 20 నిమిషాలూ యుద్ధం చూసిన‌ట్టు అనిపిస్తుంది. రెండు ప్రాంతాల‌మ‌ధ్య గొడ‌వ‌లు ఎలా మొద‌లయ్యాయి? ప‌గ‌లు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే విష‌యాల్ని స్ప‌ష్టంగా చూపించేసాడు. క‌థ హైద‌రాబాద్ షిప్ట్ అవుతుంది. అర‌వింద‌-వీర రాఘ‌వ-నీలాంబ‌రి మ‌ధ్య స‌న్నివేశాల్లో, న‌రేష్ ఇంటి సీన్ల‌లో త్రివిక్ర‌మ్ మార్క్ క‌నిపిస్తుంది. విశ్రాంతికి ముందొచ్చే స‌న్నివేశం ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంది.

ద్వితీయార్థం ఎమోషనల్‌ సీన్స్‌తో భారంగా సాగుతుంది. బాలిరెడ్డితో సంధి కుదుర్చుకునే సీన్‌ అభిమానులచే కేక పుట్టిస్తుంది. ఎక్కడా కూడా క‌థ ట్రాక్ త‌ప్ప‌లేదు. ప్రీ క్లైమాక్స్‌ నుంచి తిరిగి వేగం అందుకుంటుంది. ప‌తాక స‌న్నివేశాల్లో మాట‌ల ద్వారా మార్పు తీసుకురావ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం బాగా చూపించాడు. తమన్‌  నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్‌నే మార్చేసాడు. యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ లో తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది.

త్రివిక్ర‌మ్ ఎక్క‌డా త‌న ప్రాస‌లు, పంచ్‌లు వాడ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు. చాలా చోట్ల ఆడ‌వారి మ‌న‌సులు గెలిచే ప్రయత్నం చేసాడు. ‘మ‌గాడు ఆడ‌దాన్ని కౌగిలించుకున్నాక‌ ఆమె భుజం నుంచి లోకాన్ని చూడడ‌డం మొద‌లెడ‌తాడు’ ‘పాలిచ్చి పెంచిన ఆడ‌దానికి పాలించ‌డం ఓ లెక్కా’ లాంటి డైలాగులు హత్తుకుంటాయి.

ఎవరెలా..

ఎక్కువ మంది నటీనటులున్నా ఎన్టీఆర్‌ ఒక్కడే సినిమాను నడిపించాడు. ఎమోషన్స్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ప్రతీ భావాన్ని అద్భుతంగా పలికించాడు. రాయలసీమ యాసలో డైలాగ్స్‌ చెప్పేందుకు ఎన్టీఆర్‌ చూపించిన డెడికేషన్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, వినిపిస్తుంది. హీరోయిన్‌గా పూజా హెగ్డే ఆకట్టుకుంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ పరంగానూ మంచి మార్కులు సాధించింది. విలన్‌ పాత్రలో జగపతిబాబు జీవించాడు. నవీన్‌ చంద్ర తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సునీల్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. నాగబాబు, రావు రమేష్‌, దేవయాని, సుప్రియా పాతక్‌, ఈషా రెబ్బా, శుభలేఖ సుధాకర్‌, ‍బ్రహ్మాజీలు ఉన్నంత మేరకు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

ఫైనల్ గా..

ఫ్యాక్షనిజం సినిమా కాదా అని ఊగిపోయే సినిమా కాదు..అలా అని నీరసంగానూ లేదు.. ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం అర’విందు’ భోజనమే.