ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా.?

1528

మొదట ప్రకటించినట్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు ఈనెల 30 నుంచి వ‌చ్చే నెల 7 వ‌ర‌కూ కాకుండా వ‌చ్చే 4 నుంచి 11 వ‌ర‌కూ జ‌రుగుతాయి.

తేదీల మార్పు వెన‌క రాజ‌కీయ కార‌ణాలేవీ లేవు గానీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే పెన్ష‌న్ల‌ను రూ.2 వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా పెన్షన్లు పెంచుతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఈ రెట్టింపు పెన్ష‌న్ల‌ను వ‌చ్చే నెల నుంచే పంపిణీ చేస్తున్నారు. ఈ ప‌థ‌కాన్ని విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళి స‌మ‌ర్థంగా అమ‌లుచేసి తీరాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఉంది.

వ‌చ్చే నెల 1 నుంచి 3 వ‌ర‌కూ మూడు రోజుల‌పాటు ఈ పెన్ష‌న్లకు సంబంధించిన అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాలంటూ ఎమ్మెల్యేలందరికీ ముఖ్య‌మంత్రి ఆదేశించారు. 30 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు పెట్టుకుంటే స్థానికంగా గ్రామ‌స్థాయికి వెళ్ళే ఎమ్మెల్యేలు ఎవ్వ‌రూ ఉండ‌రు కాబట్టి స‌మావేశాల‌ను 4కి వాయిదా వేసార‌ని తెలుస్తోంది.

అంతే కాకుండా రాబోయే కొద్దిరోజుల్లో మ‌రిన్ని ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. సోమవారం జరగనున్న మంత్రి మండలి సమావేశాల్లో రైతులకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ స‌మావేశాలు చివరివి కాబోతున్న తరుణంలో ఎన్నిక‌ల‌కు వెళ్ళే స‌మ‌యం వ‌చ్చేసింది కాబ‌ట్టి తెదేపా ప్ర‌భుత్వం చేసిన పాల‌న‌పై, అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌పై, తీసుకున్న కీల‌క నిర్ణ‌యాల‌పై స‌వివ‌రంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం ఈ స‌మావేశాలలో చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.