భాజపా నేతలకు ప్రత్యేకహోదా అవసరం లేదా?

103

ఏపీ భాజపా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కన్నా లక్ష్మినారాయణ కొద్ది రోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఆ పర్యటనల్లో అక్కడక్కడా నిరసన సెగ తగులుతోంది. ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో కన్నా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు.

ఈ నేపధ్యంలో శ్రీనివాస్‌ను భాజపా నేతలు తరిమి తరిమికొట్టారు. కింద పడేసి కాళ్ళతో తొక్కారు. పోలీసులు అడ్డుకుంటున్నా భాజపా నేతలు వెనక్కి తగ్గలేదు. డాక్టర్ శ్రీనివాస్ కొద్ది రోజులుగా ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొంటున్నారు. కన్నా లక్ష్మినారాయణ వస్తున్నారని తెలిసి ఆయన పర్యటన జరిగే మార్గంలో నిరసన తెలిపేందుకు ఉదయం నుంచి నల్ల దుస్తులు, ప్లకార్డుతో అదే దారిలో నిలబడ్డారు.

కన్నా ర్యాలీ అక్కడికి వచ్చే సరికి భాజపా నేతలు శ్రీనివాస్‌పై దాడి చేసారు. ఎవరెన్ని దాడులు చేసినా ప్రత్యేకహోదా నినాదం వినిపిస్తూనే ఉంటానని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. వాస్తవానికి కన్నాపర్యటనల్లో అనేక చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం అనంతపురంలో విభజన హామీల విషయంలో నిరసన తెలుపుతున్న ఇతర పార్టీల నేతలపై భాజపా కార్యకర్తలు దాడి చేయడంతో కకాలం రేగింది.

నెల్లూరు జిల్లా కావలిలో ఓ లారీ డ్రైవర్ కన్నాపై చెప్పు విసిరాడు. అప్పుడు కూడా ఆ వ్యక్తిని చెప్పులు తీసి మరీ కొట్టారు. ఇప్పుడు ఒంగోలులోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై దాడులకు చేస్తూ భాజపా నేతలు ఏపీలో శాంతిభద్రతలు లేవని గవర్నర్ ను కలిసి మరీ ఆరోపణలు చేస్తున్నారు.