చంద్రబాబుపై ‘అక్కసు’ కక్కుతున్నారు

111

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడ్డాక కొంత‌మంది ఏపీ భాజపా నేత‌లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విష‌యమై చ‌ర్చించిన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఎన్నికల ముందు ప‌క్క రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతుంటే చంద్ర‌బాబుకు ఏం అవ‌స‌రం..? భాజ‌పాకి వ్య‌తిరేకంగా ఓటు వేయాలంటూ అక్క‌డి ప్రజలకు పిలుపునిస్తారా.? అంటూ ప్రశ్నించిన వారే ఈ వ్యవహారాన్ని చర్చకు తెచ్చినట్లు సమాచారం.

జాతీయ నాయ‌క‌త్వంలో కొంత‌మంది కీల‌క నేత‌ల మ‌ధ్య తెలుగువారి ప్ర‌స్థావ‌న వ‌చ్చింద‌ని తెలుస్తోంది. క‌ర్ణాట‌క‌లో మరో ఏడు లేదా ఎనిమిది నియోజ‌క వ‌ర్గాల్లో తెలుగువారు స‌హ‌క‌రించి ఉంటే భాజ‌పాకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ వ‌చ్చి ఉండేద‌నీ, అదే జ‌రిగి ఉంటే సొంతంగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు మార్గం సుగ‌మం అయ్యేద‌నే అసంతృప్తి వ్య‌క్త‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని స‌ద‌రు భాజ‌పా నేత‌లు ఏపీ సీఎం మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై భాజ‌పా నేత‌లు ఎంత అక్క‌సుతో ఉన్నార‌న్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడుతున్న కొన్ని గంట‌ల్లోనే అర్థ‌మైపోయింది. ఒక ద‌శ‌లో భాజపాకి ఫుల్ మెజారిటీ క‌నిపించగానే తుది ఫ‌లితాలు వెల్ల‌డికాక‌ ముందే చంద్ర‌బాబుపై భాజ‌పా జాతీయ కార్య‌ద‌ర్శి రామ్ మాధ‌వ్ విమ‌ర్శ‌లకు దిగారు. క‌ర్ణాట‌క‌లో చంద్ర‌బాబు ఎన్ని కుయుక్తులు చేసినా భాజ‌పాని తెలుగువారు ఆద‌రించారని అన్నారు. అక్కడి తెలుగువారు చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను తిప్పికొట్టార‌న్నారు.

తుది ఫ‌లితాలు వ‌చ్చేవ‌ర‌కూ చంద్ర‌బాబుపై ఆగ్ర‌హాన్ని దాచుకోలేక‌పోయారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికారం ముగింట భాజపా చ‌తికిల‌ప‌డ‌టానికి కార‌ణం చంద్ర‌బాబు అనే అభిప్రాయం వారిలో బలంగా వినిపిస్తోంది.