ఆంధ్రా భాజపా నేతలకు రాష్ట్రం అవసరం లేదా.?

71
ఆంధ్రాకు కేంద్రం విడుద‌ల చేసిన నిధుల విష‌య‌మై అమ‌రావ‌తిలో తెదేపా నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు చ‌ర్చించారు. కేంద్రం చేసిన సాయం గురించి అబ‌ద్ధాలు అవ‌స‌రం లేద‌నీ, రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన నిధులూ నిరాదరణ గురించి ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా వివ‌రించాల‌ని నేత‌ల‌కు సూచించారు. జాతీయ ర‌హ‌దారుల‌కు ల‌క్ష కోట్లు ఇచ్చామ‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే దాన్ని రూ.4 వేల కోట్లే అని కేంద్రం చెబుతూ ఉండ‌టం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు.
తాజా బ‌డ్జెట్ కేటాయింపుల ద‌గ్గ‌ర నుంచీ, విభ‌జ‌న హామీల వ‌ర‌కూ అన్నీ చ‌ర్చించారు. హోదాకు బ‌దులుగా ఇచ్చిన ప్యాకేజీలో విడతల వారీగా నిధులిస్తామ‌ని చెప్పి, ఇంత‌వ‌ర‌కూ వాటి ఊసే ఎత్తలేద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఆంధ్రా విష‌యంలో కేంద్రం అబ‌ద్ధాలు చెబితే ఊరుకునేది లేద‌న్నారు. ఇక రాష్ట్ర భాజ‌పా నేత‌ల విష‌యానికొస్తే బడ్జెట్ ప‌త్రాలు పూర్తిగా చ‌దివితే వాస్త‌వాలు అర్థ‌మౌతాయ‌నీ, ఆంధ్రాకు ఎక్క‌డా అన్యాయం చేయ‌లేద‌నీ, కొంత‌మంది నేత‌ల‌కు బ‌డ్జెట్ అర్థం కాక‌పోవ‌డం వ‌ల్ల విమ‌ర్శ‌లు చేస్తున్నారంటూ భాజ‌పా మంత్రి మాణిక్యాల‌రావు అన్నారు.
సోము వీర్రాజు అయితే కేంద్రం చేయాల్సిన వాటి కంటే ఎక్కువ చేస్తోంద‌నీ, బ‌డ్జెట్ లో ఆంధ్రాకి ప్ర‌త్యేకంగా ఇవ్వాల్సిన ఏవీ లేవ‌నీ, బ‌డ్జెట్ అద్భుత‌మ‌నీ చెప్పారు. అంతేకాదు, ఏకంగా చంద్ర‌బాబుపై అవినీతి ఆరోప‌ణ‌లు కూడా చేసారు. సో… ఏపీ భాజ‌పా నేత‌ల లెక్క‌ల ప్రకారం ఆంధ్రాకు కేంద్రం చాలా అంటే చాలా చేసేసింది. బ‌డ్జెట్ బాగుందన్నపుడు ఇప్పుడు ఆంధ్రా విష‌యంలో కేంద్రం ఎందుకు మ‌న‌సు మార్చుకోవాల్సి వ‌చ్చింది..? విభ‌జ‌న హామీల గురించి ఎందుకు పునః స‌మీక్ష చేయాల్సి వ‌స్తోంది…? ఏపీకి ఇవ్వాల్సిన నిధుల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తున్నామంటూ ప్ర‌త్యేకంగా ప్ర‌క‌ట‌న చేయాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింది..?
భాజ‌పా నేత‌ల అతి వ‌ల్ల మ‌రోసారి ఏపీలో ఆ పార్టీ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిందంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన‌వి ఇంకా ఉన్నాయ‌న్న వాస్త‌వాన్ని కొంత‌లో కొంతైనా అంగీక‌రించిన‌ట్టే క‌దా. అంటే, భాజ‌పా రాష్ట్ర నేత‌ల ధోర‌ణి సొంత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ఉంద‌నే అనిపిస్తోంది క‌దా. ఆ మ‌ధ్య, పోల‌వ‌రం విష‌యంలో కూడా సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, పురందేశ్వ‌రి వంటి నేత‌లు చాలా విమ‌ర్శ‌లు చేసారు. చివ‌రికి ఏపీ స‌ర్కారు సూచ‌న‌ల ప్ర‌కార‌మే టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్తి చేసుకోవ‌చ్చ‌నీ, నిధుల విష‌యంలో కూడా ఎలాంటి అడ్డంకులూ ఉండ‌వ‌ని కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నితిన్ గ‌ట్క‌రీ చెప్పారు.ఏపీ భాజ‌పా నేత‌లు సొంత రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం కట్టుబడినట్లు ఎక్కడా కనిపించటం లేదు.