భాజపా లక్ష్యంగా వైకాపా, జనసేనలను ఓడించాలి

293

విజయవాడలో జరిగిన మూడు రోజుల మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల ఎజెండాను ప్రకటించారు. భాజపాను లక్ష్యంగా చేసుకుని జనసేన, వైకాపాలను ఓడించి తెలుగుదేశం పార్టీని విజేతగా నిలబెట్టాలని మహానాడులో సమర నినాదం చేసారు.

తెదేపా భారతీయ జనతాపార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించింది. అసలు ఏపీలో ఉనికే లేని భాజపాని ప్రధాన శతృవుగా పేర్కొనడంతోనే వ్యూహం ఉంది. విభజన హామీలు, ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం నమ్మక ద్రోహం చేసిన భాజపాతో వైకాపా, జనసేన సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని తెదేపా ఉద్ధృతంగానే ప్రజల్లోకి తీసుకెళుతోంది. వైకాపా కర్ణాటక ఎన్నికల్లో భాజపాకి మద్దతుగా ప్రచారం చేసింది.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భాజపాపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం తిరుపతి , అనంతపురం, కాకినాడల్లో సభలు పెట్టినప్పుడు పవన్ ప్రసంగాల్లో భాజపాని, ప్రధానమంత్రి మోదీని తీవ్రంగా విమర్శించారు.  ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నేరుగా హోదా కోసం రంగంలోకి దిగింది. ప్రజలంతా ప్రత్యేకహోదా పోరాటమే చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు పోరాటం విషయంలో మాత్రం సైలెంటయిపోయారు.

ఈ నేపధ్యంలో తెదేపా మహానాడు వేదికగా వైకాపా, జనసేనలకు ఓటేస్తే భాజపాకి ఓటేసినట్లేనన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలందరూ భాజపాని సమర్థిస్తున్నాయంటూ వైకాపా, జనసేనలను టార్గెట్ చేసారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఎంతవరకూ రియాక్ట్ అవుతారో తేలాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.