వేగంగా మారుతున్న వ్యూహాలు ‘ముందస్తు’కేనా.?

150

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలకు సూచనలు పంపారు. వచ్చే ఆరు నెలలకు కార్యాచరణ కూడా ప్రకటించారు. ఆగస్టు పార్లమెంట్ సమావేశాల్లో అన్ని విపక్ష పార్టీలతో ఢిల్లీలో భారీ ఆందోళనకు ప్లాన్ చేసారు.

అన్ని పార్టీల ఎంపీలతో ఈ నెల చివరిలో సభ నిర్వహించాలని ఆదేశించారు. ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. భాజపాపై తీవ్ర స్థాయిలో అధికార వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో ఎక్కడా గెలిచే అవకాశం లేదని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చాయి. ఇప్పుడీ మూడు రాష్ట్రాల్లోనూ ఓడిపోతే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న అంచనాలున్నాయి.

ఈ నేపధ్యంలో ముందస్తుకు వెళ్ళడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఢిల్లీలో జోరుగా వినిపిస్తోంది. ఆ మూడు రాష్ట్రాలతో పాటే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. భాజపాతో సన్నిహితంగా ఉండే పార్టీలకు సమాచారం వచ్చిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహం మార్చారని చెబుతున్నారు.

వాస్తవానికి సాధారణ ఎన్నికలు సమయానికే జరుగుదాయనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతూండటంతో వేగంగా వ్యూహాలను మార్చేస్తున్నారు. ఆరు నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. పదమూడు జిల్లాల్లో యూనివర్శిటీల విద్యార్థులతో పాటు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో సమావేశమవుతానంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తిప్పి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను రాబడతానని పదే పదే చెబుతున్నారు.