ఈ ప్రశ్నలకు ‘గంటా’ సమాధానాలు కోరుతున్నారు

78

జ‌న‌సేన అధినేత ఉత్త‌రాంధ్ర యాత్ర పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటుత‌నం, క‌ళింగ ఉద్యమం, ప‌రిశ్ర‌మ‌లు ఇలా చాలా అంశాల‌పై మాట్లాడేసి వెళ్ళిపోయారు. అయితే, కొన్ని కీల‌క అంశాల‌పై మాత్రం ఆయ‌న ఎందుకు స్పందించ‌డం లేదంటూ ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప‌వ‌న్ ను ప్ర‌శ్నించారు.

విశాఖ‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో గంటా మాట్లాడుతూ ప‌వ‌న్ సొంత మాటలే మాట్లాడుతున్నారా.? జ‌గ‌న్ లేక జగన్-భాజ‌పా స్క్రిప్టా అంటూ విమ‌ర్శించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిని ప‌వ‌న్ చూడ‌లేక‌పోతున్నారన్నారు. రాష్ట్రం తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు కూడా రాజ‌కీయాలు చేస్తే చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారంటూ మండిప‌డ్డారు. జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ క‌మిటీ ఏర్పాటు చేసి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.70 వేల కోట్ల‌కు పైగా ఉన్నాయంటూ నివేదిక ప‌వ‌న్ త‌యారు చేసిన పవన్ ఆ నివేదికతో కేంద్రాన్ని నిల‌దీసే ధైర్యం ఎందుకు చేయట్లేదని ప్ర‌శ్నించారు.

ఏపీకి చెయ్యాల్సిన‌వన్నీ చేసామంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తే దానిపై ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌న్నారు? కేంద్రంపై అవిశ్వాసం పెడితే, దేశ‌మంతా ప‌ర్య‌టించి మ‌ద్ద‌తు కూడ‌గ‌డ‌తాన‌న్న ప‌వ‌న్, గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలో ఎందుకు మౌనంగా ఉండిపోయార‌న్నారు? కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిచేందుకు తెదేపా క‌ట్టుబ‌డి, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింద‌నీ, దానిపై కేంద్రం స్పందించ‌క‌పోతే ఒత్తిడి తెచ్చేలా ప‌వ‌న్ ఎందుకు మాట్లాడ‌టం లేద‌న్నారు..?

ఉత్త‌రాంధ్ర వెన‌క‌బాటుత‌నంపై ఉద్య‌మిస్తాననే ప‌వ‌న్ విశాఖ రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడ‌ర‌ని ప్ర‌శ్నించారు. వెన‌క‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్లు నిధులు వెన‌క్కి తీసుకుంద‌నీ, విశాఖ‌- చెన్నై పారిశ్రామిక కారిడార్ కు తుది అనుమతు ఇవ్వ‌లేద‌నీ, జ‌గ‌న్ అవినీతి కేసుల్లో ఎందుకు తుది తీర్పు రావ‌డం లేద‌ని ఎందుకు నిల‌దీయ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. మరి ప‌వన్ నుంచి గంటా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వ‌స్తుందో లేదో చూడాలి.