అయ్యో..పాపం కేజ్రీవాల్

35

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన సహచర మంత్రులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో మూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారులు నాలుగు నెలలుగా ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి పనులు చేయకపోవటమే దీనికి కారణం.

 

ఫిబ్రవరిలో ఢిల్లీ సీఎస్ అనుష్ ప్రకాష్‌తో కేజ్రీవాల్ కు వివాదం ఏర్పడింది. ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుండి ఐఏఎస్‌లు కేజ్రీవాల్ సర్కార్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. అధికారుల తీరుపై కేజ్రీవాల్ చాలా సార్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గ సహచరులతో లెఫ్టివెంట్ గవర్నర్‌ ఆఫీసులో బైఠాయించారు.

ఢిల్లీ ప్రజల సమస్యలు తీర్చడం కోసమే నిరసనకు దిగామని కేజ్రీవాల్ చెప్పుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేస్తూ కేసులు పెట్టి ఆప్ నేతలను బెదిరిస్తున్నారని కేజ్రీవాల్ మండి పడుతున్నారు. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావటంతో  అసెంబ్లీ ఉన్నా అధికారాలు దాదాపు లేనట్లే. ముఖ్యమంత్రి చేతుల్లో కూడా ఏమీ ఉండదు. అంతా లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా కేంద్రం నడిపించేస్తుంది. పోలీసులు సహా వ్యవస్థ మొత్తం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కనుసన్నల్లోనే ఉంటుంది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారులకూ మధ్య వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ అధికారం లేకపోవడంతో రాష్ట్ర ప్రతిపత్తి కోసం కేజ్రీవాల్ కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించి ఆమోదించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. రాజకీయాలు చేస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వల్ల కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయినా ధర్నాలు తప్పడం లేదు.