‘అంతరిక్షం’ రివ్యూ : ప్రయత్నం మంచిదే ..కానీ

341

ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి రెండో ప్రయత్నంగా స్పేస్‌ మూవీ ‘అంతరిక్షం’ తెరకెక్కించాడు. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్‌ వండర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ జోనర్ లో తెలుగు తెరపై తొలిసారి తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథేమంటే..

స్పేస్‌ సైంటిస్ట్‌ దేవ్ (వరుణ్ తేజ్) రష్యాలో ట్రైన్‌ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్‌ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. ఆ మిషన్‌ ఫెయిలవుతుంది. అదే సమయంలో ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్‌ స్పేస్‌ రిసెర్చ్‌కు దూరమవుతాడు. ఐదేళ్ళ తరువాత మిహిరా శాటిలైట్‌ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. దానితో రిసెర్చ్‌ సెంటర్‌కు దేవ్‌ అవసరం పడటంతో మిహిరాను దేవ్‌ మాత్రమే కరెక్ట్ చేయగలడని పిలిపిస్తారు. రియా(అదితిరావ్‌), కరణ్‌ (సత్యదేవ్‌), సంజయ్‌ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్ళిన దేవ్‌ మిహిరాను ఎలా సరిచేసాడు.? అన్నదే మిగతా కథ.

ఎలా ఉందంటే..

తొలి సినిమా ఘాజీతో సక్సెస్ సాధించిన సంకల్ప్ మరోసారి అదే తరహా ప్రయోగం చేసాడు. సినిమా ప్రారంభంలోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్‌ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్‌ చేసినా తొలి భాగాన్ని నెమ్మదిగా నడిపించాడు. సెకండ్‌ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్‌ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో చేసిన రిసెర్చ్‌ తెరపై కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌.స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సైన్స్‌కి సంబంధించిన క‌థ కావటంతో ఆ టెర్మ‌నాల‌జీ తెలియ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో? క‌థానాయ‌కుడు ఎందుకోసం పోరాడుతున్నాడో అర్థం కాదు. దేశ‌భ‌క్తి అనే పాయింట్ ఇందులోనూ ఉంది. కానీ దానిపై ద‌ర్శ‌కుడు ఫోక‌స్ చేయ‌లేదు. కొన్ని స‌న్నివేశాల్లో శాటిలైట్ కోడింగ్‌, డీ కోడింగ్ ఇంత సుల‌భ‌మా? అనిపించేలా ఉంటుంది.

ఎవరెలా..

వరుణ్ తేజ్‌ ప్రతీ సినిమాతో ప్రయోగాలు చేస్తూ నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్‌ కంట్రోల్‌ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, వ్యోమగామిగా ‘దేవ్‌’ పాత్రకు ప్రాణం పోసాడు. రియా పాత్రలో అదితిరావ్‌ హైదరి సూపర్బ్ అనిపించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. సత్యదేవ్‌, రాజా, రెహమాన్‌, అవసరాల శ్రీనివాస్‌ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు.

ఫైనల్ గా..

క‌ష్ట‌ప‌డ్డారని మెచ్చుకోగలం కానీ గొప్ప‌గా చూడ‌లేం.