అభిమానులు ఎదురుచూస్తున్న ‘సినిమాలు’ వస్తున్నాయి

120

2018 వెళ్ళిపోయింది ..2019 వచ్చేసింది. ఇప్ప‌టికే కొన్ని సినిమాలు ప్రేక్ష‌కులలో అంచనాలను పెంచేస్తున్నాయి. అద్భుతాలు సృష్టిస్తాయ‌ని, అఖండ విజ‌యాల్ని అందుకుంటాయ‌ని ఆయా హీరోల అభిమానులు కొండంత ఆశ‌తో ఎదురుచూస్తున్నారు.

2019లో విడుద‌ల కాబోతున్న చిత్రాల్లో మొదటగా సంక్రాంతి సీజ‌న్‌లో విశ్వవిఖ్యాత నట సార్వ్వభౌమ కీర్తి శేషులు నందమూరి తారకరామారావు గారి జీవిత నేపధ్యంలో తెరకెక్కిన బ‌యోపిక్‌ ‘యన్.టీ.ఆర్’. ఈ చిత్రాన్ని ‘క‌థానాయ‌కుడు’, ‘మ‌హానాయ‌కుడు’ పేర్లతో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రి బ‌యోపిక్ ఇలా రెండు భాగాలుగా రాలేదు. క్రిష్ ద‌ర్శ‌కుడు, ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ. కావటం ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. టాలీవుడ్‌లో పేరెన్న దగిన న‌టీన‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎన్టీఆర్ క‌థంటే ఖచ్చితంగా ఇంటిల్లిపాదీ సినిమాకు త‌ర‌లివస్తారని చిత్ర‌బృందం న‌మ్మ‌కంతో ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మరో చిత్రం కూడా తెరకెక్కుతోంది. ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ పేరుతో సంచ‌ల‌న దర్శకుడు వ‌ర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్‌ని వ‌ర్మ ఏ కోణంలో చూపించాడ‌న్న ఆస‌క్తితోనో ఈ సినిమా చూస్తారు కాబట్టి ప్రేక్ష‌కుల దృష్టిని ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ ఆక‌ర్షించే అవకాశం ఉంది.

‘బాహుబ‌లి’ సిరీస్ త‌ర‌వాత ప్ర‌భాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి త‌ర‌వాత వస్తున్న సినిమా కావటం వల్ల ‘సాహో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టు 15న విడుద‌లవుతోంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని తీర్చిదిద్దారు. ఈ సినిమాకి 200 కోట్ల బ‌డ్జెట్ కేటాయించారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇక ‘ఖైది నెంబ‌ర్ 150’తో రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ‘సైరా నరసింహారెడ్డి’ జీవిత నేపధ్యంలో తెరకెక్కుతున్న ‘సైరా’ సినిమాతో వస్తున్నారు.  బాహుబ‌లి త‌ర‌వాత తెలుగులో తెరకెక్కుతున్న సినిమా కావటం, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి దిగ్గజ నటులు సినిమాలో భాగం కావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 15న విడుద‌ల చేద్దామ‌నుకున్నా ద‌స‌రాకి షిఫ్ట్ అయ్యే ఛాన్సుంది.

గతేడాది ‘భ‌ర‌త్ అనే నేను’తో ఫామ్ లోకి వ‌చ్చిన మ‌హేష్ బాబు 2019లో ‘మ‌హ‌ర్షి’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  సామాజిక నేప‌థ్యంతో సాగే క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. వంశీ పైడి ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో రానుంది. ఈ వేస‌వి సీజ‌న్‌లో విడుద‌ల‌య్యే భారీ చిత్ర‌మిదే.