వివాదం రాజేసి విదేశాలకు వెళ్ళిపోతారా.?

137

తెదేపా ఎంపీ జె.సి.దివాక‌ర రెడ్డి త‌ప్పు చేసారనే అనాలి. విశాఖ విమానాశ్ర‌యంలో ఇండిగో సిబ్బందిపై దౌర్జ‌న్యం చేసిన జేసీపై దేశీయంగా విమానాల్లో ప్ర‌యాణించ‌డానికి వీలు లేకుండా వైమానిక సంస్థ‌లు నిషేధం విధించాయి. ఆల‌స్య‌మైనా దివాక‌ర్ ప్ర‌యాణానికి కేంద్ర మంత్రి జోక్యంతో అనుమ‌తించిన సంస్థ త‌న త‌ప్పిదాన్ని త‌ప్పించుకోవ‌డానికి ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టడం, దివాక‌ర్ తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని అశోక్ గజపతి రాజు చెప్పడం వివాదాన్ని ముదురుపాకాన పెట్టింది. అప్ప‌టిదాకా ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్ళ‌ని విష‌యం ఆయ‌న‌కూ తెలిసిపోయింది.

 

ఇప్పటికే విశాఖ భూకుంభ‌కోణం వ్య‌వ‌హారాన్ని ఎలా డీల్ చేయాలా అనే అంశంపై త‌ల‌మున‌క‌లైన ఆయ‌న దివాక‌ర్‌తో క్ష‌మాప‌ణ చెప్పించి, వివాదాన్ని ముగించాల‌ని సూచించినట్లు స‌మాచారం. మరి జేసీ క్ష‌మాప‌ణ చెప్ప‌డానికి ఒప్పుకుంటారా? అస‌లే ప్ర‌తిష్ట‌గ‌ల ఎంపీ కావటంతో అశోక్ గ‌జ‌ప‌తి రాజు గారికి కూడా ఈ వ్య‌వ‌హారం పీక‌మీద క‌త్తిలా త‌యారైంది. జేసీ మ‌ధ్యేమార్గంగా విదేశాల‌కు విదేశీ విమానంలో చెక్కేయ‌డం మరింత ఇరకాటంలో పడేసింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న నిన్న రాత్రి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్‌కి అక్క‌డి నుంచి ప్యారిస్‌కి కుటుంబంతో స‌హా వెళ్ళిపోయారు…

జ‌రిగింది త‌ప్ప‌ని ఒప్పుకుని, క్ష‌మాప‌ణ చెప్పేసి ఉంటే హుందాగా ఎంపీ స్థాయిని నిల‌బెట్టిన‌ట్లూ ఉండేది. అస‌లు ఎంపీగా అలా ప్ర‌వ‌ర్తించ‌నే కూడదు. అక్క‌డితో ఆగ‌కుండా మీడియాపై సెటైర్లు కూడా వేస్తే మీడియా ఊరుకుంటుందా..ప్ర‌తిప‌క్షం ఊరుకుంటుందా.. వెంటాడాయి.. త‌మ అనుభ‌వాల‌ను గుర్తుచేసుకుని మ‌రీ దివాక‌ర్‌ను చీల్చి చెండాడాయి. ఎలాగూ ఆయ‌న దేశంలో లేరు కాబట్టి దివాక‌ర్ వ్య‌వ‌హార శైలిని వివ‌రిస్తూ విదేశాల్లోని అన్ని విమానయాన సంస్థ‌ల‌కూ లేఖ‌లు రాసి అక్క‌డ కూడా దివాక‌ర్ విమాన ప్ర‌యాణం ఎక్క‌కుండా నిషేధం తెచ్చేలా చేస్తే ఎంపీగారు ఏం చేస్తారో చూడాలి.