‘కార్డే’ కదా అని తేలిగ్గా తీసుకోవద్దు

538

తాజాగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో ప్లాస్టిక్‌ మనీగా పిలిచే క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వినియోగం రోజురోజుకీ విస్తరిస్తోంది. నగదు అందుబాటులో లేకపోవడంతో రాబోయే రోజుల్లో వీటితో లావాదేవీలు మరింత పెరగడం ఖాయం. కార్డులను వినియోగించడంలో ఖాతాదారులు ఉంటే -ఏమాత్రం వీలు చిక్కినా కార్డుల వివరాలు తస్కరించి డబ్బు కాజేసేందుకు నేరస్థులు పొంచి ఉంటున్నారు.

ప్లాస్టిక్‌ మనీతో జరిగే మోసాలు, వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరికి డెబిట్‌ కార్డును అందజేస్తున్నారు. బ్యాంకు నుంచి కార్డు అందినప్పుడు సీల్‌ తీసినట్టుగానో, చిరుగు ఉన్నట్టో గుర్తిస్తే వెంటనే బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలి. మీకు చేరకముందే సైబర్‌ నేరగాళ్ళు కవర్లను సరఫరా చేసే ఏజెన్సీ సిబ్బందిని మచ్చిక చేసుకుని మీ వివరాలను కాజేసే అవకాశముంది. కార్డు అందుకున్న వెంటనే వెనక భాగంలో మీ సంతకం చేయాలి. బ్యాంకు కేటాయించిన పిన్‌ నంబర్‌ను వెంటనే మార్చి కొత్త నంబరును పెట్టుకోవాలి. నంబరును ప్రతీ మూడు నెలలకోసారి మారుస్తూ ఉండాలి. గుర్తించడానికి వీల్లేని అంకెలతో పిన్‌ నంబర్‌ ఉండాలి. ఆ నంబర్‌ను ఫోన్లో నిక్షిప్తం చేయడం ప్రమాదకరం. ఎవరైనా మొబైల్ హ్యాక్‌ చేస్తే సమాచారమంతా వారి చేతిలో పడుతుంది.

ఆన్‌లైన్‌ లావాదేవీల్లో సీవీవీ నంబరే కీలకం. ఖాతా నుంచి నగదును బదిలీ చేసిన ప్రతీసారి సీవీవీ, గ్రిడ్‌ నంబర్లను వినియోగించాల్సి ఉంటుంది. కార్డు వెనకభాగంలో ఉన్న మూడు అంకెలు (సీవీవీ) కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాకు మీరు నిత్యం వినియోగించే చరవాణి సంఖ్యతోపాటు మెయిల్‌ ఐడీని అనుసంధానం చేయాలి. అలా చేస్తేనే లావాదేవీ జరిగిన ప్రతీసారి చరవాణికి, మెయిల్‌కు సమాచారం అందుతుంది.

ఆర్‌బీఐ, ఆదాయ పన్ను కార్యాలయం, బ్యాంక్‌ పేరుతో నేరగాళ్ళు ఫోన్‌ చేస్తారు లేదా మెయిల్‌ పంపిస్తారు. పాస్‌వర్డ్‌, కస్టమర్‌ ఐడీ, పిన్‌నంబర్‌, సీవీవీ నంబర్‌, వ్యక్తిగత వివరాలు అడుగుతారు. అలా అడిగారంటే నూటికి నూరు శాతం అది సైబర్‌ నేరగాళ్ళ పనే. షాపింగ్ చేసేపుడు కళ్ళ ఎదురుగానే కార్డును యంత్రంలో స్వైప్‌ చేసేలా చూసుకోవాలి. కార్డును స్వైప్‌ చేసాక పిన్‌ నంబర్‌ను బయటివారెవరికీ కనిపించకుండా మనమే చాటుగా నమోదు చేయాలి.

ఏటీఎం యంత్రాల్లోని కార్డు రీడర్ల (కార్డును లోపలికి పెట్టే ప్రాంతం)లో, నంబర్లను ప్రెస్‌ చేసే ప్రదేశంలో ఏమైనా తాత్కాలికంగా అమర్చారా..? పిన్‌ నంబర్‌ నమోదు చేసే ప్రదేశం కనిపించేలా పైభాగంలో ఏదైనా రహస్య కెమెరా ఉందా..? అని ఒకటి రెండు సార్లు తనిఖీ చేసుకోవటం శ్రేయస్కరం.