కర్ణాటక ఎన్నికల్లో ‘గాలి’ వీచలేదు

113

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గాలి కుటుంబస‌భ్యుల‌పై భాజ‌పా చాలా ఆశ‌లు పెట్టుకుంది. గాలి జ‌నార్థ‌న్ రెడ్డి సోద‌రులు, అనుయాయులతో క‌లిపి మొత్తంగా ఏడు సీట్లు ఇచ్చింది. గాలి సోద‌రుల అంగబ‌లం, అర్థ‌బ‌లంపై భాజపా అపార‌మైన న‌మ్మ‌కం పెట్టుకుంది. లాబీయింగ్ చేసి తెచ్చుకున్న సీట్ల‌లో త‌న‌వారిని గెలిపించుకోవ‌డం కోసం గాలి జ‌నార్థ‌న్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌చార వ్యూహాన్ని ప‌ర్య‌వేక్షించారు.

బ‌ళ్లారిలోకి గాలి ప్ర‌వేశించ‌కూడ‌ద‌న్న కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబ‌ట్టి, 50 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఒక బంగ్లాలో బ‌స చేసి మ‌రీ ప్ర‌చారం సాగించారు. తీరా ఫ‌లితాలు వ‌చ్చేస‌రికి 7 సీట్ల‌లో 3 స్థానాల‌ను మాత్ర‌మే భాజ‌పా గెలుచుకుంది. హ‌ర‌ప‌న‌హళ్ళి నుంచి క‌రుణాక‌ర రెడ్డి, బళ్ళారి నుంచి సోమ‌శేఖ‌ర రెడ్డి, మొల్క‌ల‌మురు నుంచి బి. శ్రీ‌రాములు మాత్ర‌మే గెలుపొందారు. గాలి వ‌ర్గం అంత‌కుమించి ప్రభావం చూప‌లేక‌పోయింది. నిజానికి, ఇంత‌కుమించిన అద్భుతం ఏదో చేస్తార‌ని గాలి జ‌నార్థ‌న రెడ్డి నుంచి భాజ‌పా చాలా ఆశించింది.

గాలిపై ఉన్న కేసుల‌ను కూడా క్ష‌మించేస్తున్నామంటూ ఎడ్యూర‌ప్ప ఎన్నిక‌ల ముందే చెప్పారు. దీంతో పార్టీ రుణం తీర్చుకోవ‌డం కోసం గాలి బాగానే ఖ‌ర్చు పెట్టారు. ఎంత చేసిన‌ప్ప‌టికీ బళ్ళారి బాబుల ప్ర‌భావం హైద‌రాబాద్‌-క‌ర్ణాట‌క ప్రాంతంలోని కొన్ని సీట్ల‌లో విజ‌యానికి మాత్ర‌మే దోహ‌ద‌ప‌డింది. ఇక‌, కాంగ్రెస్ పార్టీ కూడా భాజ‌పా మాదిరిగానే మైనింగ్ లాబీని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకునే ప్ర‌య‌త్నం బాగానే చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో గాలి సోద‌రుల అవినీతిని వేలెత్తి చూపిస్తూ కాంగ్రెస్ లాభ‌ప‌డింది.

ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భాజ‌పా మాదిరిగానే ఆనంద్ సింగ్‌, బి. న‌రేంద్ర‌తోపాటు లాడ్ సోద‌రుల‌కు టిక్కెట్లు ఇచ్చింది. ఈ ఇద్ద‌రూ విజ‌య‌న‌గ‌ర‌, బ‌ళ్లారి రూర‌ల్ నియోజ‌క వ‌ర్గాల్లో విజ‌యం సాధించారు. లాడ్ సోద‌రులు ఓట‌మి చ‌విచూసారు. మొత్తంగా, రెండు జాతీయ పార్టీలూ బళ్ళారి బాబుల‌పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాయి. కానీ, అంతిమంగా వారి ప్ర‌భావం రెండు పార్టీల్లోనూ గ‌తంతో పోల్చితే త‌గ్గింద‌నే చెప్పుకోవాలి. ఓవరాల్ గా కర్ణాటక రాజకీయంలో బళ్ళారి బాబుల ప్రభావానికి తెరపడుతోందనిపిస్తోంది.