‘భైరవగీత’ రివ్యూ : వర్మ ‘రక్త’ గీత

346

ఇటీవల వరుస పరాజయాలతో దర్శకుడిగా ఫాం కోల్పోయిన  రాంగోపాల్ వర్మ నిర్మాతగా మారి సిద్దార్థ్‌ తాతోలును దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన పిరియాడిక్‌ ఫ్యాక్షన్‌ డ్రామా ‘భైరవగీత’. వర్మ ప్రమోషన్‌తో మంచి హైప్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే..

కథేమంటే..

రాయలసీమ ప్రాంతంలో భైరవ (ధనుంజయ), సుబ్బారెడ్డి(బాల రాజ్‌వాడీ) అనే ఫ్యాక్షనిస్ట్‌ దగ్గర పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి తన స్థాయికి తగ్గట్టుగా కూతురు గీత(ఇర్రా మోర్‌)ను కట్టారెడ్డి (విజయ్‌ రామ్‌) అనే ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. గీత, భైరవను ప్రేమించటంతో ఇద్దరు ఊరొదిలి పారిపోతారు. సుబ్బారెడ్డి, కట్టారెడ్డి.. భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ వారిపై తిరుగుబాటు చేస్తాడు. ఆ పోరాటం ఎలా సాగింద‌న్న‌దే మిగతా కథ.

ఎలా ఉందంటే..

ఈ సినిమా క‌థేమిట‌న్న‌ది ప్రారంభంలోనే వ‌ర్మ వాయిస్ ఓవ‌ర్ ద్వారా చెప్పేసాడు. సుబ్బారెడ్డి, క‌ట్టారెడ్డి పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసిన విధానం చూస్తే ప్రారంభ స‌న్నివేశాల్లోనే ద‌ర్శ‌కుడి తాలుకూ ఇంటెన్సిటీ అర్ధమవుతుంది.రాయ‌ల‌సీమ అంటే కొండ‌లూ, గుట్ట‌లూ, రాళ్లూ, రాప్ప‌లు. వాటి మ‌ధ్యే కెమెరాని అందంగా తిప్పుకొచ్చాడు దర్శ‌కుడు. అయితే సాదా సీదా అయిన క‌థ‌ని, అదే స్థాయి క‌థ‌నంతో కాస్త విసుగు పుట్టిస్తాడు. వయొలెన్స్‌ మీద పెట్టిన దృష్టి, ఇతర సన్నివేశాల మీద పెట్టినట్టుగా అనిపించదు. ముఖ్యంగా లవ్‌ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు. భైర‌వ‌ని ప్రేమించేయాల‌ని గీత‌కు ఎప్పుడు, ఎలా క‌లిగిందో తెలీదు. గీత‌ని భైర‌వ ఎందుకు ప్రేమిస్తాడో తెలీదు. ప్రేమ పుట్ట‌డానికి లాజిక్ లేక‌పోయినా ఒక‌రి కోసం మ‌రొక‌ర‌రు చ‌చ్చిపోయేంత ప్రేమ పుట్టాలి అన్న‌ప్పుడు మాత్రం బ‌ల‌మైన కార‌ణాల్ని ప‌ట్టుకోవాలి. ద్వితీయార్థంలో ఎమోషన్స్‌ పండించే అవకాశం ఉన్నా వయలెన్స్‌ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది.

ఎవరెలా..

న‌టీన‌టుల్ని వెదికి ప‌ట్టుకోవ‌డంలో దిట్ట వ‌ర్మ‌. ధ‌నుంజ‌య్ ఒకటే ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చినా ఈ సినిమాకి అది చాలు. క‌థానాయికలో అక్క‌డ‌క్క‌డ శ్రియ పోలిక‌లు క‌నిపిస్తాయి. లిప్ లాప్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయింది. సుబ్బారెడ్డి, క‌ట్టారెడ్డి పాత్ర‌ధారులు చెల‌రేగిపోయారు. మిగిలిన వారు పాత్ర మేర న‌టించి మెప్పించారు.

ఫైనల్ గా..

వర్మ ‘రక్తచరిత్ర’లో మరో పార్శ్వం