తెలంగాణ సీఎల్పీ నేతగా ‘భ‌ట్టి విక్ర‌మార్క’

616

తెలంగాణ సీఎల్పీ నేత‌గా సీనియ‌ర్ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పేరును హైక‌మాండ్ ఖ‌రారు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఏఐసీసీ విడుద‌ల చేసింది.

గురువారం జ‌రిగిన సీఎల్పీ భేటీలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. నిజానికి, ఈ ఎంపిక‌ ఏక‌గ్రీవం అవుతుందనుకున్నప్పటికీ పార్టీలో అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీంతో కాంగ్రెస్ హైక‌మాండ్ నుంచి వేణుగోపాల్ వచ్చి నేత‌ల‌తో ఒక తీర్మానం చేయించారు. ఫైన‌ల్ గా సీఎల్పీ నేత‌గా భ‌ట్విక్ర‌మార్క పేరుకి పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ టిక్ పెట్టారు.

వాస్తవానికి, సీఎల్పీ నేత‌గా భ‌ట్టితో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా పోటీ ప‌డ్డారు. అయితే, భ‌ట్టి గ‌తంలో ఉప స‌భాప‌తిగా ప‌నిచేసారు కాబ‌ట్టి, స‌భా వ్య‌వ‌హారాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉంది. ప్ర‌భుత్వ చీఫ్ విప్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు కాబట్టి  ఇత‌ర కాంగ్రెస్ నేత‌ల‌తో పోల్చితే, ఆయ‌న ఆచితూచి మాట్లాడ‌తార‌నే ఇమేజ్ కూడా ఉంది.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ఇప్ప‌టికే ఒక వ‌ర్గం తీవ్ర‌మైన అసంతృప్తి ఉంది. కాబ‌ట్టి, ఉత్త‌మ్ కి ఈ బాధ్య‌త‌ల‌ను ఇస్తే పార్టీలో అదో చ‌ర్చ‌నీయాంశంగా మారే అవ‌కాశాలే ఎక్కువ‌ అదీ కాక రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి పీసీసీ అధ్య‌క్షుడుగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాబ‌ట్టి, ద‌ళిత సామాజిక వ‌ర్గానికి టి.కాంగ్రెస్ ప్రాధాన్య‌త ఇచ్చే విధంగా కూడా భ‌ట్టి ఎంపిక జ‌రిగింద‌నేది స్ప‌ష్టమైంది.