భాజపాలోనే ఉంటారు ..కానీ పోటీ చేయరట.!

25

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సొంత పార్టీకి షాకిచ్చారు. పార్టీ తరపున పోటీ మాత్రం చేసేది లేదని తేల్చి చెప్పారు.

కృష్ణాజిల్లా కైకలూరు నుంచి భాజపా తరపున పోటీ చేసి తెదేపా మద్దతుతో గెలిచిన కామినేని శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. తెదేపా, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో మంత్రి పదవికి రాజీనామా చేసారు. అప్పటి నుండి భాజపా వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇతర భాజపా తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా కామినేని మాత్రం విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు.

ఈ నేపధ్యంలో కామినేని శ్రీనివాస్ తెదేపాలో చేరుతారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఈ విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ తనకు భాజపాని వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేసారు. గతంలో పీఆర్పీ తరపున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ వెంకయ్యనాయుడు ఆశీస్సులతో గత ఎన్నికల్లో తెదేపాతో పొత్తు కారణంగా కైకలూరును దక్కించుకున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఏపీలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు.

వాస్తవానికి ఒక్క కామినేని మాత్రమే కాదు మాణిక్యాలరావు, హరిబాబు కూడా పోటీ చేయబోమని చెబుతున్నారు. దీంతో భాజపా నేతలకు పోటీపై వైరాగ్యం వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.