యూపీలో ‘భాజపా’కి సెగ మొదలైందా.?

188

భారతీయ జనతా పార్టీకి యూపీలో దెబ్బ పడింది. గత ఎన్నికల్లో యూపీలో భాజపా దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. 80 పార్లమెంట్ సీట్లలో 71 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో విజయం సాధించింది. అయితే భాజపాని అడ్డుకోవడానికి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపాయి. మాయావతి, అఖిలేష్ యాదవ్‌లకు తోడు కాంగ్రెస్, ఆర్‌ఎల్డీ కూడా జట్టుగా మారాయి.

యూపీలో మైనారీటీలు, దళితులపై దాడులు పెరగడం, యోగి ప్రభుత్వ పాలనపై ఏడాదికే తీవ్ర వ్యతిరేకత రావడంతో భాజపాకి చెక్ పెట్టేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ చేతులు కలపటంతో ఫలితం వెంటనే కనిపించింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేయగా  ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య రాజీనామా చేసారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి.

కలసి కట్టుగా పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీ కూటమి రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంది. కైరానాలో ఆర్‌ఎల్డీ విజయం సాధించగా నూర్పూర్ అసెంబ్లీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ గెలుపొందింది. విపక్షాలన్నీ ఏకమవడం తమకు సవాలేనని భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా చెబుతున్నారు. అందుకే ఓట్లలో చీలిక తీసుకురాకపోతే పెను ప్రమాదం ఖాయమని అంచనాకు వచ్చారు.

గత ఎన్నికల్లో భాజపాదేశం మొత్తం మీద 282 సీట్లను గెలుచుకుంది. అందులో యూపీలో గెలిచినవే 71. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో కూడా ఒక్కటీ వదలకుండా క్లీన్ స్వీప్ చేసారు. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రాకపోతే యూపీలో భాజపా సింగిల్ డిజిట్ కు పడిపోయినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన రాజకీయం యూపీని వేడెక్కించే అవకాశాలు లేకపోలేదు.