ఏపీలో కొత్త కూటమి కూడుతోందా.?

187

తెలంగాణ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కొత్త పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నారనేది బహిర్గతమే.  అయితే ఆయన సిపిఐ, న్యూడెమోక్రసీలో ఒక వర్గంతో కలసి కొత్త కూటమిని ప్రారంభించే ప్రయత్నాలు నడుస్తున్నాయని సమాచారం. ఈ కూటమి కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవగాహనకు వస్తుందంటున్నారు. మరో వైపున సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు.

తెలంగాణలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒక కొత్త పార్టీ స్థాపన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, దళిత నేతలు మాజీ ఎంపిలు హర్షకుమార్‌, చింతామోహన్‌ ఈ దిశలో సమాయత్తమవుతున్నట్టు సమాచారం. మరోవైపు ముద్రగడ కాపునాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో కాపులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సభలో వీరితో పాటు కాంగ్రెస్‌ నేతలు శైలజానాథ్‌, జంగాగౌతమ్‌, కొప్పులరాజు తదితరులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో అంబేద్కర్‌ విగ్రహం విషయమై అగ్రవర్ణాలకు దళితులకు మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. దానికి ముందు రాజమండ్రిలో హర్షకుమార్‌ దళిత చైతన్య సదస్సు నిర్వహించారట. ఈ సదస్సులోనే మోహన్‌ కొత్తపార్టీ ఆలోచన తీసుకొచ్చారట.జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన తదుపరి వ్యూహం ఇంకా వెల్లడించలేదు. ఆయన గనక తెదేపాతో కలిసేట్టయితే కాపులు దళితుల వేదికగా రంగంలోకి దిగి పోటీ చేయాలన్న ఆలోచనతో పార్టీ ప్రతిపాదన వచ్చిందనుకోవచ్చు. ఈ సందర్భంగా చింతా మోహన్‌ వంటివారు వైకాపాని నిశితంగానే విమర్శించారని చెపుతున్నారు.