‘ఐఏఎస్’ ప్రేమకధకు ‘మతం’ ట్విస్టు

647

వాళ్ళిద్దరూ కాబోతున్న ఐఏఎస్ అధికారులు .. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.. అయితే వారి ప్రేమకు మతాలు అడ్డుపడుతున్నాయి.. ఇది సినిమా కధ కాదు.

దేశ ఉన్నత పరీక్ష సివిల్స్‑2015లో టాప్‌ ర్యాంకర్‌ టీనా దాబీ, సెకండ్ ర్యాంకర్‌ అతహార్‌ ఆమిర్‌ ఉల్‌ షపీ ఖాన్‌లు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు.

ఇద్దరి నేపధ్యం 

పొలిటికల్ సైన్స్ లో యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్‌ను సాధించిన టీనా తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌(2015)లో తొలి ర్యాంక్‌ ను సాధించింది. టీనా తండ్రి జశ్వంత్ దాబీ ఢిల్లీ టెలికాం విభాగంలో, తల్లి హిమాలీ దాబీ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.

అనంతనాగ్‌ జిల్లాలోని దేవీపురా ఆమిర్‌ సొంత ఊరు. ఆమిర్‌ తండ్రి అక్కడి ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్. తల్లి గృహిణి. 2014లో 560 ర్యాంక్ సాధించిన ఆమిర్‌, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్‌కు ఎంపికై లక్నోలో శిక్షణ పొందారు. అయితే ఐఏఎస్‌ సాధించాలనే అతని కల రెండో ప్రయత్నంలో(2015) నెరవేరింది.

తొలి కలయిక

ముస్సోరి లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ ఐఏఎస్‌ అకాడమీలో ట్రైనీగా చేరేముందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఇద్దరూ మొదటిసారిగా కలుసుకున్నారు. మొదటి రోజునే ఆమిర్‌ ఖాన్‌ టీనాను ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేసాడు. సాయంత్రానికి టీనాకు చూడగానే ప్రేమ పుట్టింది నిర్మొహమాటంగా చెప్పేసాడు. టీనాకు ఎలా స్పందించాలో తెలియలేదు.

ias

ప్రేమ 

కొద్ది రోజుల తర్వాత ముస్సోరిలోని ఐఏఎస్ అకాడమీలో ట్రైనీలుగా చేరి మరికొన్నాళ్ళకు కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ చేసిన పొరపాటల్లా సామాజిక మాధ్యమాల్లో వారి స్టేటస్ ను షేర్ చేసారు. అయితే ఇద్దరి ప్రేమకు కుల మత అడ్డంకులు వచ్చి పడ్డాయి. దానితో కొందరు సోషల్ మీడియాలో పరాయి మతస్థుడితో చనువేంటని కొందరు, దళిత బిడ్డవు కాబట్టి అణగారిన వర్గాలకు ఆదర్శంగా ఉండాలని ఇంకొందరు కామెంట్లు చేసారు.

వారిద్దరి ప్రేమ వివాహాన్ని రద్దు చేయాలని, లేదంటే ఖాన్‌ను మతం మార్చుకునేందుకు ఒప్పించాలని, అందుకు అతడు ఒప్పుకున్న తర్వాతే పెళ్ళి చేయాలని టీనా దాబీ తల్లిదండ్రులను కోరుతూ ఆఖిల భారతీయ హిందూ మహాసభ ఓ లేఖ కూడా రాసింది.

ఇద్దరూ ఏమంటున్నారంటే..

ఆమీర్‌కు, నాకు పరిచయం ఉన్న వాళ్లలో 95 శాతం మంది మా ప్రేమను అభినందించారు. మా పెద్దలు కూడా అభ్యంతరపెట్టలేదు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే నిశ్చితార్థం చేసుకుంటాం. పెళ్ళి ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం. అంబేద్కర్‌ నాకు ఆదర్శం. ఆయన చూపిన బాటలో దేశానికి మేలు చేయాలనేది మా ఇద్దరి అభిలాష.

సాంకేతికంగా ఎంత ముందుకెళ్తున్నా కుల, మత అంతరాలు లేని సమాజం ఎప్పటికీ ఆవిష్కృతం కాదేమో.