అవినీతి ఆరోపణలతో సొంత డీఎస్పీని అరెస్ట్ చేసిన ‘సీబీఐ’

330

భారతదేశ ప్రజాస్వామ్యం పదిలంగా పరిఢవిల్లాలని రాజ్యాంగ నిర్మాతలు కొన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఏర్పాటు చేసారు. అందులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఒకటి. పూర్తిగా స్వతంత్రంగా పని చేయాల్సిన సంస్థ ఇప్పుడు అవినీతి ఉచ్చులో బిగుసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన ఇద్దరు అధికారులు కేసులను కొట్టివేయించేందుకు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారంటూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకున్నారు. ఇందు కోసం దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేస్తున్నారు. ఇలా దొంగ డాక్యుమెంట్లు తయారు చేసారని సీబీఐ డీఎస్పీ దేవేందర్‌కుమార్ ను సీబీఐ అధికారులే అరెస్ట్ చేసారు.

వాస్తవానికి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాకు మొదటి నుంచీ పొసగటం లేదు. ఖురేషీ అనే వ్యక్తికి సంబంధించిన కేసుకు సంబంధించి అలోక్‌ వర్మ ముడుపులు తీసుకున్నారంటూ రెండు నెలల క్రితం రాకేశ్‌ కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాసారు. అదే ఆరోపణపై ఇప్పుడు ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసింది. అలోక్‌ వర్మ, సీబీఐ, ఈడీల్లోని మరికొందరు అధికారులు కలిసి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే సతీశ్‌ సన అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించారని ఆస్థానా మరోసారి ఆరోపణలు చేసారు. వీరిద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.

సీబీఐ డీఎస్పీ దేవందర్ కుమార్ అరెస్ట్‌తో ఈ వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ అయింది. అత్యున్నత దర్యాప్తు సంస్థలో అధికారుల ఇద్దరిపై అవినీతి ఆరోపణలు రావడం వారిలో వారే ఆరోపణలు చేసుకోవడం దొంగ డాక్యుమెంట్లు కూడా తయారు చేయడం కలకలం రేపుతోంది. వారే దొంగ డాక్యుమెంట్లు తయారు చేసుకుంటే రాజకీయ లక్ష్యాల కోసం ఇంకెన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి రాజకీయ బాసులకు మేలు చేసారన్న ఆరోపణలు ఇతర పార్టీల వైపు నుంచి వస్తున్నాయి. పరిస్థితి విషమిస్తూ ఉండటంతో అలోక్ వర్మ, రాకేష్ అస్తానాలను మోడీ తనను కలవాలని ఆదేశించారు.