వైకాపాలో చేరాలంటే సీబీఐ కేసు ఉండాలట .!

169

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించాక తెదేపా ప్ర‌ముఖ నేత‌లంతా ఏదో ఒక సంద‌ర్భంలో విమ‌ర్శ‌లు చేసారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ జ‌గ‌న్ పైనా, వైకాపా నేత‌ల పైనా మండిప‌డ్డారు.  ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి లోకేష్ హాజ‌రై అక్క‌డ మీడియాతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నంబ‌ర్ వ‌న్ గా ఉంద‌న్నారు. మరిన్ని కంపెనీలు త్వరలోనే ఏపీకి రాబోతున్నాయ‌న్నారు. వైయ‌స్ హయాంలో జ‌గ‌న్ ప్రోత్సాహంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ క‌ర‌ప్ష‌న్ లో నంబ‌ర్ వ‌న్ అయ్యామంటూ ఎద్దేవా చేసారు.

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబుకీ, వైయ‌స్ కీ పోలిక లేద‌ని, రాష్ట్రానికి చాలా ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చాయ‌నీ, ఇంకా వ‌స్తున్నాయ‌నీ, ఐటీలో ఇంత‌వ‌ర‌కూ ప‌ద‌మూడు వేల ఉద్యోగాలు వ‌చ్చాయ‌నీ, కావాలంటే కంపెనీల‌ వారీగా లెక్క‌ల‌తో స‌హా చెప్తాన‌ని అన్నారు. ఒక ఆర్థిక నేర‌స్థుడిని చూసి కంపెనీలు ఆంధ్రాకు వస్తాయా లేదా అనేది ప్ర‌జ‌లకు తెలుసని చెప్పారు. జ‌గ‌న్ కు ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప వేరే ఏం ప‌నుంద‌ని ప్ర‌శ్నించారు. ప్యార‌డైజ్ పేప‌ర్ల‌లో ఎవ‌రి పేరుంద‌న్నారు. వైకాపా నేత‌లంద‌రికీ కేసులు ఉండ‌టం అనేది ప్రీ క్వాలిఫికేష‌న్ అంటూ ఎద్దేవా చేసారు. వైకాపాలో స‌భ్య‌త్వం తీసుకుని చేరాల‌నుకుంటే, సీబీఐ కేసు ఉండ‌టం త‌ప్ప‌నిస‌రి అంటూ వ్యంగ్యంగా అన్నారు.

ఏదేమైనా పాద‌యాత్రకు ముందు ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్న తెదేపా ప్యార‌డైజ్ పేప‌ర్లు బ‌య‌ట‌కి రావ‌డం, వాటిలో జ‌గ‌న్ పేరు ప్ర‌స్థావ‌న ఉండ‌టాన్ని బాగానే వాడుకుంటోంది. ఇప్పటికే జగ‌న్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనే విమ‌ర్శ బాగానే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళారు. ఇప్పుడు కొత్త‌గా, ప్ర‌పంచంలో  అవినీతిమంతుల జాబితా ఎక్కడ బ‌య‌ట‌కి వ‌చ్చినా జ‌గ‌న్ పేరు ఉంటోంద‌ని ఆరోపిస్తున్నారు.