డిజిటల్ చెల్లింపులపై కేంద్రం రాయితీలు

554

దేశాన్ని నగదురహితంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న కేంద్రం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నజరానాలు ప్రకటించింది. కార్డులు, ఇతర డిజిటల్‌ మాధ్యమాల ద్వారా కొనుగోళ్ళు,  చెల్లింపులు చేసేవారికి మినహాయింపులు ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం వెల్లడించారు.

పెట్రోలు, డీజిల్‌, రైలు టిక్కెట్లు, ఇతర రైల్వే సేవలు, బీమా, టోల్‌లాంటి వాటిలో రాయితీలు, తాయిలాలు దక్కనున్నాయి. రైలు టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.10లక్షల ప్రమాద బీమా ఉచితంగా వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. ఆహారం, వసతి, విశ్రాంతి గదులు తదితర సేవలకు సంబంధించిన సేవలపై కూడా డిజిటల్‌ చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం, సబర్బన్‌ రైల్వేల్లో సీజనల్‌ టిక్కెట్లు 0.5 శాతం రాయితీ, పెట్రోల్‌, డీజీల్‌ కొనుగోళ్ళలో 0.75శాతం రాయితీ కల్పించనున్నారు.

పదివేలకు మించి జనాభా ఉన్న లక్ష గ్రామాలకు రెండేసి పీఓఎస్‌ పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు డిజిటల్‌ మాధ్యమంలో చెల్లించే వినియోగదారులపై లావాదేవీ రుసుము, ఎమ్‌డీఆర్‌ రుసుములాంటివి మోపకుండా ఖర్చును భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఓఎస్‌ పరికరాలు వాడుతున్న వ్యాపారుల నుంచి నెలకు రూ.100కు మించి అద్దె వసూలు చేయకూడదని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం సూచించింది. రూ.2000కు మించని డిజిటల్‌ లావాదేవీలపై సేవల పన్నును కూడా మినహాయించింది. జాతీయ రహదారుల వద్ద టోల్‌ చెల్లింపుల కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ, ఫాస్టాగ్‌లు వాడేవారికి 10 శాతం రాయితీ కల్పించింది.

నలుపు ‘తెలుపు’ కాదు

బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగానే నల్లధనం తెల్లధనంగా మారదని అరుణ్‌ జైట్లీ అన్నారు. మూలాలు చూపని ధనంపై పన్ను కొరడా ఝళిపిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా విరాళాలు ఈ పద్ధతిలోనే సేకరించాలని అన్నారు. నగదు రద్దును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ పదేళ్ళ యూపీఏ పాలనలో నల్లధనానికి వ్యతిరేకంగా తీసుకున్న ఒక్క నిర్ణయాన్నైనా వెల్లడించాలని సవాలు విసిరారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకంపై మాట్లాడుతూ సదరు ఆదాయంలో 50 శాతం పన్నుగా వసూలు చేయడంతోపాటు మరో 25 శాతాన్ని నాలుగేళ్ళ పాటు ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడం వల్ల మొత్తం 65 శాతం పన్ను వేసినట్లుగా అవుతుందని అన్నారు.