కేంద్ర మంత్రి సదానందకే దిక్కులేదు…

500

కేంద్రమంత్రి సదానంద గౌడ గారి సోదరుడు కామెర్ల వ్యాధి తో ఆసుపత్రిలో మరణించారు. ఆ సమయం లో మంత్రిగారు అక్కడే వున్నారు. బిల్లు అరవై వేల రూపాయలు అయింది. మొత్తం డబ్బు కట్టి శవాన్ని తీసుకెళ్లమని ఆసుపత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.

వెంటనే గౌడ గారు తనదగ్గరున్న అరవై వేలరూపాయలను చెల్లించారు. అయితే అవన్నీ రద్దు అయిన నోట్లు. వాటిని తీసుకోబోమని ఆసుపత్రి వారు మంత్రిగారికి చెప్పేసారు. దాంతో మంత్రిగారికి ఒళ్ళుమండి పోయింది. డిసెంబర్ చివర వరకు పాత నోట్లు ఆసుపత్రిలో చెల్లుతాయని కేంద్రం ఆదేశించిన సంగతి గుర్తు చేశారు. అయినా ఆసుపత్రి వారు వినలేదు. దాంతో మంత్రి గారికి ఆగ్రహం ఆకాశాన్ని అంటింది. ఆ సంగతి లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. అప్పుడు ఆసుపత్రి వారు కొంచెం దిగివచ్చి చెక్కు రూపేణా చెల్లింపు తీసుకుని శవాన్ని ఇచ్చేసారు.

ఇవాళ కేంద్రమంత్రికి ఎదురైన అనుభవం ఇది. కేంద్రమంత్రికి ఇలాంటి అనుభవం ఎదురైతే, ఇక సామాన్యుడి సంగతి ఏమిటి? మామూలు మనిషి అయితే ఆసుపత్రి వారు అతడిని బయటకి గెంటివేసేవారు కారా? ఏసీ గదుల్లో కూర్చుని ఆసుపత్రులలో, పెట్రోల్ బంకులలో పాతనోట్లు చెల్లుతాయి అని ప్రకటనలు చెయ్యడం కాదు. ఇలా జనం మధ్యకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి.

Central minister Sadanand Gowda plight in hospital due to currency issuesకేంద్ర మంత్రి సదానందకే దిక్కులేదు…

ఇవాళ పొద్దున్న టీవీ చర్చలో పాల్గొన్న ఒక బీజేపీ నాయకుడు పెట్రోల్ బంకులలో పాతనోట్లు తీసుకుంటున్నారు కావాలంటే రండి అని సవాలు విసిరాడు. ఆ నాయకుడికి నేను సవాలు విసురుతున్నాను. హైద్రాబాద్ లో ఏ బంకుల్లో తీసుకుంటున్నారో వచ్చి చూపించమనండి. ఇవాళ నేనే పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తే పాత నోట్లు తీసుకోము అని బంకుల్లో చెప్తున్నారు. అయిదు వందల నోటు ఇస్తే చిల్లర లేదు అని ముందుగానే చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే నాయకులు ప్రజలతో, సమాజం తో సంబంధం కోల్పోయారేమో అనిపిస్తున్నది.

బీజేపీ నాయకులు అలా రోడ్ల మీదకు వెళ్లి బాంకుల ముందు, ఏటీఎం ల ముందు నిలుచుకున్న వారిని ఎందుకు పలకరించరు? క్యూలలో నిలుచున్న వారికీ కాస్త మంచినీళ్లు ఎందుకు అందించరు? ఈ నాలుగైదు రోజులు ఓర్చుకోమని ఎందుకు కోరరు? మోడీ గొప్ప విజన్ ను అక్కడ క్యూలో నిలుచున్న వారికి బోధించి ఎందుకు ఎడ్యుకేట్ చెయ్యరు?

ఊరికే టీవీలలో, మీడియా ముందు కూర్చుని గప్పాలు కొట్టడం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు గుడిసెల్లో కూడా దూరి వాళ్ళ కాళ్లుచేతులు పట్టుకుని ఓట్లకోసం అడుక్కుంటారు కదా… ఇప్పుడు ఆయా విధంగా ఇల్లిల్లూ తిరిగి ప్రధాని పట్ల మోజును, క్రేజు ను పెంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

– ఇలపావులూరి మురళీ మోహన రావు