ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం భారీ సవరణలు

553

దేశంలో నోట్ల రద్దు అనంతరం నల్లదనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం వేగంగా పావులు వేగంగా కదుపుతోంది. తాజాగా ఆదాయ పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం భారీ సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఐటీ చట్ట సవరణల బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభలు వాయిదా పడేముందు -తొలుత లోక్‌సభలోను, ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. గత శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీలో చర్చించిన అనంతరం సవరణలపై నిర్ణయం తీసుకున్నారు.
తాజా సవరణ బిల్లు ప్రకారం లెక్కల్లోచూపని ఆదాయాన్ని అధికారికంగా ప్రకటిస్తే 50శాతం పన్ను కింద మినహాయించి మిగిలిన 50శాతాన్ని కేంద్ర ప్రభుత్వం తన వద్దే ఉంచుకుంటుంది. ఈ 50 శాతంలో వెంటనే 25శాతం, నాలుగేళ్ళ అనంతరం  మరో 25శాతం తీసుకొనే అవకాశం కల్పిస్తుంది.  50 శాతం పన్నులో 30 శాతం పన్నుగాను, పది శాతం పెనాల్టీలపై 33శాతం సర్‌ఛార్జిలుగాను లెక్కిస్తారు.

income

ఒక వేళ అధికారులు దాడుల్లో నల్లధనాన్ని పట్టుకుంటే డబ్బు మొత్తానికి ఫ్లాట్‌ 60శాతం పన్నుతో పాటు పన్నుపై 25 శాతం సర్‌ఛార్జి (15 శాతం) కలిపి దాదాపు 75 శాతం వరకూ పోతుంది. దీనికి తోడు పన్ను అంచనా వేసే అధికారి మరో 10 శాతం పెనాల్టీ వేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధంగా వెలికితీసిన ఆదాయాన్ని దేశంలో పేదరిక నిర్మూలనకై ప్రారంభించిన ‘ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్ యోజన’ ద్వారా వివిధ పథకాలు చేపట్టనున్నారు.

కొత్త చట్టసవరణ బిల్లుకు ఈ సమావేశాల్లోనే  అన్ని పార్టీల ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలతోనూ చర్చలు ప్రారంభించింది. స్వల్ప కాలంలోనే ఈ చట్టం కింద చర్యలు తీసుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

-ప్రకాష్ సూర్య కెఎల్ఎన్వీ