ఏపీ సీఎం ‘దావోస్’ పర్యటనపై దిగొచ్చిన కేంద్రం

97

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బృందంపై ఆంక్షలు విధించిన కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.

చంద్రబాబుతో పాటు 17 మంది బృందం దావోస్‌ వెళ్ళడానికి అనుమతిచ్చారు. చంద్రబాబు 22న దావోస్ వెళ్ళనున్నారు. నాలుగు రోజుల పాటు సదస్సులో పాల్గొంటారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అవుతారు. 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి తిరిగి వస్తారు. రెండు రోజుల కిందట ఏపీ ప్రభుత్వం పంపిన వివరాలను కాదని కేంద్రం సీఎంతో పాటు ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చింది.

ఏ ముఖ్యమంత్రి అయినా అధికారిక హోదాలో విదేశాల్లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. కేంద్ర విదేశాంగ శాఖకు పర్యటన వివరాలు పంపితే వారు ఆమోద ముద్ర వేస్తూ లేఖ పంపుతారు. చంద్రబాబు పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసింది. దావోస్ సదస్సుకు ప్రపంచ పెట్టుబడిదారులందరూ వస్తారు కాబట్టి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడానికి అంతకంటే మంచి అవకాశం ఉండదు. వారి ముందు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్లు ఇవ్వడం ద్వారా ఆకట్టుకోవాలని చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూంటారు.

కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీ గురించి దావోస్‌లో చంద్రబాబు విభిన్న వ్యుహాలతో ప్రచారం చేస్తున్నారు. హోర్డింగులు పెడుతున్నారు. బస్సులపై కూడా పబ్లిసిటీ చేస్తున్నారు. ప్రత్యేకమైన స్టాల్ కూడా నిర్వహిస్తున్నారు.