ఈ తలనొప్పులు ఎప్పటికి తప్పేనో..!

165

చంద్రన్న బీమా పథకం ఎలాగున్నా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం డీలా పడిపోతున్నారనిపిస్తుంది. వారంలో నాలుగు రోజులు ఆయన పార్టీ నాయకులను రప్పించి సర్దిచెప్పడం, హెచ్చరించడం ఇదే సరిపోతున్నది. తాజాగా నంద్యాల‌లో భూమా అఖిల ప్రియ- ఎ.వి,సుబ్బారెడ్డి వ్యవహారం సర్దుబాటు చేయలేక సతమతమవుతుంటే ఎంపి జెసి దివాకరరెడ్డి మరోసారి రచ్చకెక్కారు. గత రెండేళ్ళలో ఈ సర్దుబాటు ప్రహసనం పరిస్థితిని దిగజార్చడం తప్ప మెరుగుపర్చింది లేదు.

ప్రకాశం జిల్లాలో ముఠాతగాదాలు హత్యల వరకూ వెళ్ళాయి . విజయవాడలో ఆర్‌టిఎ కమిషనర్‌నే ఎంపి కేశినేని, బోండా ఉమల దురుసుతనం విమర్శలకు గురైంది. తర్వాత ఆయనతోనూ క్షమాపణ చెప్పామనిపించారు. నెల్లూరు కడప, కర్నూలు కృష్ణా ఇలా ప్రతిచోటా తెలుగుదేశం శిబిరాలుగా విడిపోయింది.విశాఖలో ఇద్దరు మంత్రులు పరస్పరం ఆరోపణలు గుమ్మరించుకుంటున్నారు. జెసి మేనల్లుడు ఎంఎల్‌సి దీపక్‌ రెడ్డిని హైదరాబాద్‌ భూ కుంభకోణంలో పోలీసులు అరెస్టు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చింతమనేని ప్రభాకర్‌ పోలీసులపై దౌర్జన్యానికి గాను అభిశంసనకు గురయ్యారు. అసలు దీనంతటికి చంద్రబాబు నిస్సహాయతే కారణంగా చెబుతున్నారు.

ఇటుకలు పేరుస్తుంటే మీరు బుల్‌డోజర్‌తో కూలగొడుతున్నారని ఆయన పార్టీవారితో అనడం ఇందుకు కారణం. ఇది పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమేనని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు తర్వాత కూడా ఇతర పార్టీల వారిని విచక్షణా రహితంగా తీసుకుని పదవులు కట్టబెట్టడం వల్ల కలిగిన అనర్థమిది. ఇప్పుడు తెదేపాలో మూడు తరహాలున్నారు- వీర విధేయులుగా విచారంతో అధినేతను ఆశ్రయిస్తున్నవారు. అలాగే ఇతరపార్టీల నుంచి వచ్చి ఇమిడిపోయిన వారు రెండవ రకం. మూడో రకం ఈ రెండు రకాల వారి మధ్య నలిగిపోతున్న సాధారణ నేతలు కార్యకర్తలు. కేంద్రం శాసనసభ స్థానాలు పెంచుతుందో లేదో ఇంకా తెలియదు. ఈ క్రమంలోనే ఉద్రేకాలు పెరుగుతున్నాయి. ఏమైనా వైకాపాలోకి తిరిగి వలసలు కూడా మొదలవడం తెలుగుదేశం నాయకత్వం కాదనలేని నిజం.